గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ కు గత ఏడాది మిస్టర్ బచ్చన్ పెద్ద షాకే ఇచ్చింది. రైడ్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా కనీసం యావరేజ్ అయినా కొంచెం రిలీఫ్ ఉండేది కానీ మరీ దారుణంగా పోవడం అభిమానులను నిరాశపరిచింది. అయితే దీని ప్రభావం తన ప్రోజెక్టుల మీద పెద్దగా లేదు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడం ఆలస్యం ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. వెంకటేష్ ఈయనతో చేయడానికి సానుకూలంగా ఉన్నట్టు ఇటీవలే టాక్ వచ్చింది కానీ అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. హరీష్ ఇవి కాకుండా బాలీవుడ్ డెబ్యూకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
సల్మాన్ ఖాన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ఒక హిందీ మూవీని ప్లాన్ చేస్తోంది. హరీష్ చెప్పిన కథకు కండల వీరుడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ఎప్పుడు మొదలుపెట్టాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఒకవేళ ఇదే కనక ముందు మొదలయ్యే పనైతే మాత్రం హరీష్ శంకర్ కు చాలా పెద్ద సవాల్ ఎదురవుతుంది. ఎందుకంటే సల్మాన్ ట్రాక్ రికార్డు దారుణంగా ఉంది. సికందర్ కు డిజాస్టర్ ముద్ర పడిపోగా అంతకు ముందు కిసీకా భాయ్ కిసీకా జాన్ ఏకంగా ట్రోలింగ్ కు టార్గెట్ గా మారి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఆ మాటకొస్తే సుల్తాన్, భజరంగి భాయ్ జాన్ స్థాయి సక్సెస్ సల్మాన్ చూసి సంవత్సరాలు గడిచిపోయాయి.
సో ఇప్పుడు హిట్టు ఇచ్చి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత హరీష్ శంకర్ మీద ఉంది. అసలే నార్త్ మీడియాకు మన దర్శకులంటే తెగ అక్కసు. దాన్ని సందీప్ రెడ్డి వంగా మీద కూడా చూపించబోయారు కానీ కబీర్ సింగ్, యానిమల్ రికార్డులు సృష్టించడంతో వాళ్ళ నోళ్లు మూతబడ్డాయి. కానీ ఏఆర్ మురుగదాస్ దారుణంగా దొరికిపోయాడు. సో హరీష్ శంకర్ మొదటి క్యాటగిరీలో పడాలంటే సల్మాన్ తో చేయబోయే సినిమా ఆషామాషీగా ఉండకూడదు. ముఖ్యంగా కంటెంట్ పరంగా రొటీన్ అనిపించకూడదు. మరి ఇంత పెద్ద ఛాలెంజ్ ని ఎలా స్వీకరిస్తాడో చూడాలి. ఈ ఏడాది చివర్లో ఓపెనింగ్ జరిగే సూచనలున్నాయి.