టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్.. ఇంటర్వ్యూల్లో సినిమా సంగతులు చాలా మాట్లాడతారు కానీ.. వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా ప్రస్తావించడు. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. తాను, తన భార్య స్నిగ్ధ పిల్లలు వద్దనుకున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇందుకు కారణమేంటో కూడా హరీష్ శంకర్ వివరించాడు.
‘‘మాది మధ్యతరగతి కుటుంబం. పిల్లలందరిలోనూ నేనే పెద్ద. చెల్లికి పెళ్లి చేయటం, తమ్ముడిని సెటిల్ చేయటం, అమ్మానాన్నలకు మంచి జీవనశైలి కల్పించటం… ఇలా చాలా రోజులు బాధ్యతలు తీర్చటంతో సరిపోయింది. వీటన్నింటిలోనూ నాకు నా భార్య మద్దతుగా నిలిచింది. ఇక నా జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నా. నేను, నా భార్య కూర్చుని మాట్లాడుకుని పిల్లలు వద్దనుకున్నాం. ఎందుకంటే అందరూ పిల్లలు పుట్టిన తర్వాతే స్వార్థంగా తయారవుతారు. వారి ప్రపంచం కుదించుకుపోతుంది. పిల్లల చుట్టూనే తిరుగుతుంది’’ అని హరీష్ శంకర్ చెప్పాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడుసార్లు గెలవడానికి ఆయనకు పిల్లలు లేకపోవడం.. ఎలాంటి బాదరబందీ లేకుండా నిస్వార్థంగా ఉండగలడని ప్రజలు నమ్మడం కూడా ఒక కారణమని ఈ సందర్భంగా హరీష్ శంకర్ వ్యాఖ్యానించాడు. తన భార్యకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండదని.. తన సినిమా కబుర్లన్నీ ఆఫీస్, సినిమా సెట్స్‌లోనే ముగిసిపోతాయని.. తన పారితోషకం ఎంతో కూడా తన భార్యకు తెలియదని ఈ సందర్భంగా హరీష్ చెప్పాడు. తన తండ్రి రిటైర్డ్ తెలుగు టీచర్ అని.. ఆయనకు ఒక ట్యాబ్ కొనిచ్చాక ఇబ్బందులు మొదలయ్యాయని.. తన గురించి మీడియాలో వచ్చే వార్తలు చూసి ఆయన కంగారు పడుతుంటారని.. ఐతే అవి పట్టించుకోవద్దని చెబుతంటానని హరీష్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates