ఏప్రిల్ 25 విడుదల కావాల్సిన కన్నప్ప వాయిదా పడింది. ఒక కీలక ఎపిసోడ్ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం పట్టడం వల్ల చెప్పిన టైంకి రిలీజ్ చేయలేకపోతున్నామని మంచు విష్ణు అఫీషియల్ గా ట్వీట్ చేశాడు. త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని పేర్కొన్నాడు. రెండు మూడు వారాల నుంచే విష్ణు ప్రమోషన్లు విస్తృతంగా చేయడం చూస్తున్నాం. ముంబైకి వెళ్లి మరీ టీజర్ లాంచ్ చేసొచ్చాడు. మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. ఇటీవలే జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్ లోనూ సినిమా తాలూకు కబుర్లు పంచుకున్నాడు. ఇంతా చేసి పోస్ట్ పోన్ అంటే అందరికంటే ఎక్కువ ఫీలయ్యేది ప్రభాస్ ఫ్యాన్సే.
విష్ణు చెప్పిన కారణం కాకుండా మరికొన్ని అంశాలు వాయిదాకు దారి తీసినట్టు అనిపిస్తోంది. ఉగాది పండగను మినహాయిస్తే కన్నప్ప చేతిలో ఉన్నది కేవలం 25 రోజులు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులున్నాయి. ఆర్టిస్టుల డబ్బింగులు అందరివీ పూర్తి కాలేదు. గ్రాండ్ గా చేయాలనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ డేట్లు అందుబాటులో లేవు. అందులోనూ మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లు ఏప్రిల్ లో దొరికేలా లేరు. ఇవి కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ ముఖ్యమైన కొన్ని సీన్లలో కరెక్షన్లు అవసరమయ్యాయట. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పరుగులు పెట్టడం కన్నా క్వాలిటీ మీద దృష్టి పెట్టడం మంచిందని ఆగిపోయారు.
వచ్చే నెలకు సంబంధించి రెండు మంచి డేట్లు వృథా అయ్యాయి. 18 రావాల్సిన అనుష్క ఘాటీ తప్పుకోవడం ఇప్పటికే ట్రేడ్ ని నిరాశపరిచింది. ఇప్పుడు కన్నప్ప కూడా సైడ్ కావడం ఇంకో ప్యాన్ ఇండియా మూవీ రాకుండా చేసింది. ఇదే రోజు ప్లాన్ చేసుకున్న భైరవం ఏప్రిల్ 25 రావడం దాదాపు ఖరారే అనుకోవచ్చు. ఇందులో మంచు మనోజ్ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. సరే ఆలస్యమైనా పర్వాలేదు బెస్ట్ కావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు కన్నప్ప మీద మరింత వర్క్ చేయబోతున్న విష్ణు నెక్స్ట్ జూన్ లేదా జూలై ఆప్షన్ల వైపు చూస్తున్నాడని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం.