టాక్ తేడా ఉన్నా 100 కోట్లు లాగేసింది

భారీ అంచనాల మధ్య విడుదలైన ఎల్2 ఎంపురాన్ కు మలయాళంలో ఏమో కానీ ఇతర భాషల్లో డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. కేరళ మీడియాలో సైతం ఆహా అద్భుతం అనేంతగా రివ్యూలు కనిపించలేదు. అయినా సరే మోహన్ లాల్ ఇమేజ్, లూసిఫర్ బ్రాండ్ జనాన్ని థియేటర్లకు రప్పిస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం రెండు రోజులు గడవకముందే ఎల్2 ఏకంగా వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. ఇంతవేగంగా ఈ భారీ సంఖ్యను అందుకున్న మలయాళ మూవీగా కొత్త రికార్డు నమోదు చేసింది. గురువారం రిలీజ్ కావడంతో లాంగ్ వీకెండ్ దొరకడం లాలెట్టాన్ కు కలిసి వచ్చేలా ఉంది.

సరే వినడానికి బాగానే ఉంది కానీ బుక్ మై షో నెంబర్లు, ఇప్పుడు చూపిస్తున్న అంకెల మీద అనుమానాలు లేకపోలేదు. మాములుగా అన్ని భాషల్లో విపరీతమైన హైప్ ఉన్న సినిమాలకు మాత్రమే ఇలాంటి ఫీట్లు సాధ్యమవుతాయి. కెజిఎఫ్, పుష్ప లాంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ ఎల్2 ఎంపురాన్ కు అలాంటి అడ్వాంటేజ్ లేదు. శని ఆదివారాల్లో హైదరాబాద్ బుకింగ్స్ చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. బిసి సెంటర్స్ లో ఆల్రెడీ నెమ్మదించింది. తమిళనాడులో విక్రమ్ వీరధీరశూరకొచ్చిన పాజిటివ్ టాక్ క్రమంగా ఎల్2ని వెనుబడేలా చేస్తోంది. సో దీని ఒరిజినల్ వెర్షనే బాగా ఆడుతోందన్న మాట.

ఫైనల్ గా ఎల్2 ఎంపురాన్ ఎక్కడ ఆగుతాడో చెప్పలేం కానీ సోమవారం నుంచి మాత్రం పెద్ద పరీక్షే మొదలుకానుంది. ఫస్ట్ డే కలెక్షన్లు బాగానే వచ్చినప్పటికీ ఏపీ తెలంగాణ హక్కులు తీసుకున్న దిల్ రాజు ఎంతమేరకు రికవర్ చేసుకుంటారనేది ఇంకో నాలుగైదు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. కాకపోతే ఆయన డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చేస్తున్నారు తప్పించి థియేటర్ హక్కులు కొనలేదు. సో ఒకవేళ తేడా కొడితే అది ఎల్2 అసలు నిర్మాతలకు నష్టం వస్తుంది కానీ ఎస్విసికొచ్చిన ఇబ్బందేం లేకపోవచ్చని ట్రేడ్ టాక్. మ్యాడ్ స్క్వేర్ ప్రభావం ఈ సినిమాతో పాటు రాబిన్ హుడ్, వీరధీరశూర పార్ట్ 2 మీద గట్టిగానే పడేలా ఉంది.