అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా మూవీ లాక్ కాకముందు దర్శకుడు అట్లీ ప్లాన్ చేసుకున్నది సల్మాన్ ఖాన్ తో అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే పలు దఫాలు చర్చలు, వాయిదాల తర్వాత ఫైనల్ గా ఆగిపోయింది. ఎందుకనే కారణాల గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ సికందర్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కండల వీరుడు ఓపెనయ్యాడు. అట్లీ రాసుకున్నది చాలా పెద్ద బడ్జెట్ యాక్షన్ మూవీ, అంత ఖర్చు వర్కౌట్ కాదనే ఉద్దేశంతోనే వద్దనుకోవాల్సి వచ్చిందనే ఉద్దేశంతో భాయ్ వివరణ ఇవ్వడంతో తెరవెనుక ఏం జరిగిందనే దాని గురించి కొంత క్లారిటీ వచ్చింది.
ఇంకో ట్విస్ట్ ఏంటంటే అట్లీ చెప్పిన కథలో రజనీకాంత్ వస్తారా లేక కమల్ హాసన్ చేస్తారా అనేది తనకు తెలియదని సల్మాన్ చెప్పడం మరో అనుమానం లేవనెత్తుతోంది. అంటే ఇప్పుడిదే స్టోరీని బన్నీకి చెప్పి ఒప్పించినందు వల్లే రెండో హీరో ఉంటాడనే ప్రచారం జరుగుతోందా లేక పూర్తిగా వేరే కథను చెప్పాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కొద్దిరోజుల క్రితం శివ కార్తికేయన్ పేరు బలంగా వినిపించింది. బన్నీతో తన కాంబినేషన్ కోలీవుడ్ మార్కెట్ పరంగా ఉపయోగపడుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ అట్లీ దుబాయ్ లో ఉంటూ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చేస్తుండటంతో అప్డేట్స్ లేవు.
ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు. అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎదురు చూపులు దాని మీదే ఉన్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నాడు. అట్లీది ఓకే చేసినా త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. వేసవి తర్వాత రెండు సమాంతరంగా చేసే సాధ్యాసాధ్యాల గురించి ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే నిర్మాత నాగవంశీ చెప్పింది కూడా ఇదే. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ కంటే బ్యాంకబుల్ హీరో అల్లు అర్జుననే క్లారిటీ అయితే వచ్చేసింది. అందుకే నిర్మాతలు అంత ధైర్యంగా వందల కోట్ల పెట్టుబడికి రెడీ అవుతున్నారు.