సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా యాభైకి పైగా కథలు విని ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే ప్రచారం ఫిలిం నగర్ లో ఊపందుకుంది. అది ఒకవేళ మాములు హిట్టయ్యుంటే ఇంత ఆలస్యం చేసేవారు కాదేమో కానీ తన రియల్ బాక్సాఫీస్ స్టామినా గుర్తించాక వెంకీ కాంబోల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతకు ముందు సానుకూలంగా స్పందించినవాళ్ళను సైతం వెయిటింగ్ లిస్టులో పెట్టేశారట. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు వెంకటేష్ 77 డైరెక్టర్ ని దాదాపుగా లాక్ చేసుకున్నారని తెలిసింది. ఆ బ్యాక్ స్టోరీ ఏంటో చూద్దాం.
సామాజవరగమన రచయితల్లో ఒకరైన నందు అయిదారు నెలల క్రితమే వెంకటేష్ కు ఒక కథ చెప్పారు. సురేష్ బాబుకి కూడా బాగా నచ్చింది. హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి ట్విస్టింగ్ పాయింట్ ఉందట. దర్శకత్వ అనుభవం లేని నందు దాన్ని హ్యాండిల్ చేయలేడనే అనుమానంతో కేవలం కథ మాత్రమే తీసుకునేలా అంగీకారం కుదిరిందని సమాచారం. మరి దర్శకుడి ఎవరయ్యా అంటే హరీష్ శంకర్ పేరు వినిపిస్తోంది. మిస్టర్ బచ్చన్ ఫెయిలైనా అతని కాపబిలిటీ మీద నమ్మకంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అఫీషియల్ అయ్యేదాకా నిర్ధారణగా చెప్పలేం కానీ సోర్స్ అయితే గట్టిదే.
ఒకవేళ ఎప్పుడు మొదలుపెట్టినా 2026 సంక్రాంతి బరిలో దింపాలనేది ప్రాధమిక టార్గెట్. నిర్మాత ఎవరు తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇంకొంచెం టైం పట్టేలా ఉండటంతో హరీష్ శంకర్ కు మరో ప్రాజెక్టు చేసేందుకు తగినంత సమయం ఉంది. రామ్, బాలకృష్ణలకు నెరేషన్ ఇచ్చాడు కానీ అవి కూడా టైం డిమాండ్ చేస్తున్నాయట. సో మరి వెంకీది నిజంగా ఓకే అయితే మాత్రం మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డిజాస్టర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ నమ్మే స్టార్లు దొరకడం ఎవరికైనా అదృష్టమే. దాన్ని సంపూర్ణంగా వాడుకోవడం హరీష్ శంకర్ చేతుల్లోనే ఉంది.