టీజర్ తోనే అంచనాలు పెంచేసిన మ్యాడ్ స్క్వేర్ తాజాగా మరో రెండు నిమిషాల ట్రైలర్ తో హైప్ ఇంకాస్త పెంచేసింది. స్టోరీని కొంచెం కూడా దాచకుండా అరటిపండు ఒలిచినట్టు చెప్పేసి మరీ ఆడియన్స్ ని రమ్మంటున్నారు. లాంచ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇండియన్ కాపీలకు సంబంధించి పనులు జరుగుతున్నాయని, అవి సిద్ధం కాగానే ఎక్కడెక్కడ రేపు రాత్రి ప్రీమియర్లు వేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం చూస్తే నమ్మకం ఓ రేంజ్ లో ఉన్నట్టే. మ్యాడ్ కూడా ఇదే తరహాలో స్పెషల్ ప్రీమియర్లకు నోచుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే రాబిన్ హుడ్ మీద మ్యాడ్ స్క్వేర్ ఆధిపత్యం కనిపిస్తోంది. థియేటర్ల కేటాయింపులో మైత్రి పడుతున్న కొన్ని ఇబ్బందుల వల్ల ఇంకా స్క్రీన్ కౌంట్ తేలలేదు కానీ ఉన్నంతలో కొంత నెమ్మదిగా ఉన్న మాట వాస్తవం. యూత్ లో మటుకు మ్యాడ్ 2 మీద ఎక్కువ బజ్ ఉంది. మొదటి రోజే ఫన్ ఎంజాయ్ చేయాలని డిసైడవుతున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కోసం నితిన్ నార్నె, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతకు ముందు కాలేజీలు తిరిగి పబ్లిసిటీ చేసుకున్నారు.
ఫైనల్ గా ఓపెనింగ్స్ కి కావాల్సిన లెక్క సరిపోయినట్టే. ఇక టికెట్ రేట్ల పెంపు గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. ధరలు తక్కువగా ఉండే కొన్ని సెంటర్లలో మాత్రమే హైక్ పెడుతున్నామని, మిగిలిన చోట సాధారణ రేట్లకే అందరూ మ్యాడ్ స్క్వేర్ ఎంజాయ్ చేయొచ్చని నాగవంశీ చెప్పేశారు. ఎల్2 ఎంపురాన్ లాంటి గ్రాండియర్ పోటీలో ఉన్నప్పటికీ దాని వల్ల తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పడానికి లేదు. హైదరాబాద్ మినహాయించి ఎల్2 అమ్మకాలు చాలా నెమ్మదిగా ఉన్నాయి. బాగా బాగుందనే టాక్ వస్తే సామాన్య ప్రేక్షకులు వచ్చేందుకు ఛాన్స్ ఉంది. సో మ్యాడ్ స్క్వేర్ నిజంగా మేజిక్ చేస్తుందో లేదో రేపు రాత్రి తేలనుంది.