సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వ సాధారణం. దీనికి ఎవరూ మినహాయింపుగా నిలవడం లేదు. కొందరు పోటీ వల్ల అక్కసుతో, మరికొందరు అదో రకమైన పైశాచిక ఆనందంతో ఇలా రకరకాల కారణాల వల్ల ఆన్ లైన్ ని ఒక చెత్తబుట్టగా మార్చేశారు. ఏదో ఒక రూపంలో అందరూ బాధితులే. ఒక డిజాస్టర్ వస్తే చిరంజీవిని సైతం లెక్క చేయని బ్యాచ్ ఇది. మంచు విష్ణు తన కుటుంబం మీద జరుగుతున్న నెట్ దాడికి మినీ యుద్ధమే చేయాల్సి వచ్చింది. స్టార్ హీరోలు పెద్దగా పట్టించుకోరు కానీ గ్రౌండ్ లెవెల్ లో అభిమానులు చేసుకునే ట్రోలింగ్ వార్ మహా దారుణంగా ఉంటుందనేది వాస్తవం.
దీని బారిన పడిన హీరోయిన్లు ఎందరో. పూజా హెగ్డే కూడా ఈ లిస్టులో ఉంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో దీని గురించి స్పందించింది. తనను ట్రోల్ చేస్తున్న పేజెస్ గురించి కనుక్కోమని తన టీమ్ కు చెబితే అప్పుడు షాకింగ్ విషయాలు కొన్ని తెలిశాయట. వెనుక నుండి కొందరు డబ్బులిచ్చి మరీ ట్రోలింగ్ చేయిస్తున్న సంగతి బయట పడింది. అంతే కాదు ఒకవేళ వాటిని ఆపాలంటే ఎంత మొత్తం ఖర్చవుతుందో ముందే చెప్పేస్తున్నారు. అంటే చేయడానికి ఒక రేటు, చేసింది ఆపేయడానికి ఒక రేటు. ఈ వ్యాపారమేదో బాగుంది కదూ. అలాని హీరో హీరోయిన్లు ఉత్తి పుణ్యానికి డబ్బులు ఇచ్చుకుంటూ పోలేరు కదా.
ఈ సమస్య పూజాతో మొదలైంది కాదు, ఇకపై ఆగేది కూడా కాదు. ట్విట్టర్, ఇన్స్ టాలో దొంగ ఐడిలతో చాటుగా చేసే ఇలాంటి ట్రోలింగ్ దందాలు వేలల్లో కాదు లక్షల్లో ఉంటున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ టైంలో ఇవి పతాక స్థాయికి చేరుకున్న సందర్భాలు ఎన్నో. దేవరకు అదే జరిగింది కానీ తట్టుకుని నిలబడి విజయం సాధించింది. పుష్ప 2కి ట్రై చేశారు కానీ జరిగింది చరిత్ర. కంటెంట్ బాలేకపోవడం వల్ల గేమ్ ఛేంజర్ దొరికిపోయింది కానీ లేదంటే రామ్ చరణ్ అంత ద్వేషానికి గురయ్యేవాడు కాదు. పరిశ్రమను వేధిస్తున్న పైరసీ లాగే ఈ ట్రోలింగ్ కూడా ఎవరూ కట్టడి చేయలేని పెను భూతంగా మారిపోతోంది.