స్టార్ హీరోకు ఆనందాన్నివ్వని బ్లాక్‌బస్టర్

పీకే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ రోజుల్లోనే రూ.800 కోట్ల వసూళ్లు రాబట్టిందీ సినిమా. అప్పటికే ఒకసారి ‘3 ఇడియట్స్’తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఆమిర్ ఖాన్, రాజ్ కుమార్ హిరాని జోడీ.. ‘పీకే’తో పాత రికార్డులన్నింటినీ సవరించేసింది. ఐతే భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఆ సినిమా విషయం ఇటు ఆమిర్, అటు హిరాని ఇద్దరూ అంత సంతృప్తిగా లేరట. అందుక్కారణం ముందు అనుకున్న కథను మధ్యలో మార్చి తీయడమే అంటున్నాడు ఆమిర్.

‘పీకే’ పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే.. ఆ సినిమా తమకు సంతృప్తినివ్వలేదని ఆమిర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘నిజానికి పీకే కథను రాజ్ కుమార్ హిరాని వేరేలా రాసుకున్నారు. కానీ షూటింగ్ జరిగేటపుడు చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. తాను అనుకున్న క్లైమాక్స్.. అప్పుడే విడుదలైన మరో సినిమాను పోలి ఉండడంతో.. దాన్ని కాపీ పేస్ట్ చేసినట్లు అవుతుందని హిరాని అనుకున్నారు. దీంతో ముగింపు మొత్తం మార్చేశాం. కానీ హిరాని ముందు రాసిన క్లైమాక్సే తీసి ఉంటే.. ఈ చిత్రం ఇంకా బాగుండేది. అందుకే సినిమా పెద్ద విజయం సాధించినప్పటికీ మా ఇద్దరికీ సంతృప్తిగా అనిపించలేదు’’ అని ఆమిర్ తెలిపాడు.

ఇటీవల రాజ్ కుమార్ హిరాని కూడా ఓ ఇంటర్వ్యూలో ‘పీకే’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీ చిత్రాల్లో అనుకున్న దాని కంటే బాగా ఆడిన సినిమా ఏదంటే.. ‘పీకే’ పేరే చెప్పాడు. మంచి కంటెంట్ ఉండి అనుకున్నంతగా ఆడని చిత్రం ‘డంకీ’ అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం హిరాని.. సంజయ్ దత్‌తో ‘మున్నాభాయ్-3’ తీసే ప్రయత్నంలో ఉండగా.. ఆమిర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘సితారే జమీన్ పర్’లో నటిస్తున్నాడు. వీళ్లిద్దరూ మళ్లీ కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు.