‘జాక్’పాట్ కొట్టాలంటే ఇవి దాటాలి

టిల్లు సిరీస్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ చేస్తున్న జాక్ ఏప్రిల్ 10 విడుదల కానుంది. ఇవాళ సాంగ్ లాంచ్ సందర్భంగా టీమ్ మొత్తం మీడియా ముందు హాజరయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ మీద టిల్లు లాగా భీభత్సమైన హైప్ లేదు. క్రమంగా దాన్ని పెంచే పనిలో ఉన్నారు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో డ్యూయల్ రోల్ చేస్తుండగా ఇప్పటిదాకా వచ్చిన పాటలు మెల్లగా ఆడియన్స్ కు ఎక్కేస్తున్నాయి. మొదట వదిలిన పబ్లో నెరుడాకి అచ్చు రాజమణి కంపోజింగ్ చేయగా తాజాగా విడుదల చేసిన కిస్ పాటను సురేష్ బొబ్బిలి స్వరపరిచాడు.

ఇలా వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకోవడం వెనుక దర్శకుడు భాస్కర్ స్ట్రాటజీ ఏమైనా వీలైనంత వైరలైపోయి బజ్ పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషించాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సామ్ సిఎస్ కిస్తారనే టాక్ నేపథ్యంలో జాక్ ముందు పెను సవాళ్లున్నాయి. మొదటిది టిల్లు బ్రాండ్ నుంచి బయటికి వచ్చి సోలోగా తన స్టామినాని ఇంకో కోణంలో ఆవిష్కరించాల్సిన బాధ్యత సిద్ధూ మీదుంది. పైగా రచనలో కొన్ని సలహాలు సూచనలు చేసినట్టు పబ్లిక్ గానే ఒప్పేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ స్టైల్ ని స్ఫూర్తిగా తీసుకుని టిల్లుని డిజైన్ చేసుకున్నానని చెబుతున్న సిద్ధూకు యూత్ ఫాలోయింగే ఓపెనింగ్స్ తీసుకురావాలి.

ఇదిలా ఉండగా అదే రోజు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ కావడం జాక్ ని కొంత ప్రభావితం చేసే ఛాన్స్ లేకపోలేదు. మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి డబ్బింగ్ వెర్షన్ అయినా సరే పబ్లిసిటీకు పెద్ద ఎత్తున చేస్తారు. ఇదే బ్యానర్ సన్నీ డియోల్ జాత్ కూడా అదే రోజు విడుదల కానుంది. వీటిని తట్టుకుని సిద్దు జాక్ రూపంలో జాక్ పాట్ కొట్టాలంటే సినిమా అదిరిపోవాలి. తర్వాత క్యూలో ఉన్న తెలుసు కదా, కోహినూర్ లాంటి వాటికి బిజినెస్ రేంజ్ పెరగాలంటే జాక్ బ్లాక్ బస్టర్ సాధించాలి. అదే జరిగితే మార్కెట్ రేంజ్ పెరుగుతుంది. సిద్దు మాత్రం సక్సెస్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.