సంగీత దర్శకుడు తమన్ మళ్ళీ హాట్ టాపిక్ అయిపోయాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ పాటలు హుక్ స్టెప్స్ లేకపోవడం వల్ల ఎక్కువ రీచ్ తెచ్చుకోలేదని, తనవరకు బెస్ట్ ఇచ్చాననే రీతిలో కామెంట్ చేయడం మెగా ఫ్యాన్స్ చర్చకు దారి తీసింది. ఇదే తమన్ గేమ్ ఛేంజర్ రిలీజ్ ముందు ఒక రియాలిటీ షోలో జరగండి జరగండి పాట చూశానని, ప్రభుదేవా కొరియోగ్రఫీ అదిరిపోయిందని ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించాడు. ఇదే విషయాన్ని పలు ట్వీట్ల ద్వారా ఊరిస్తూ వచ్చాడు. ఇటీవలే జరిగిన ఒక డాన్స్ ప్రోగ్రాంలో చిన్న పాపను మెచ్చుకుంటూ ఇదే డాన్స్ గేమ్ ఛేంజర్లో ఉంటే బాగుండేదని కామెంట్ చేశాడు.
ఇలా ఒకే అంశం మీద తమన్ రెండు రకాలుగా మాట్లాడ్డం పట్ల మ్యూజిక్ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పాటలు బాగుంటే సినిమా బాక్సాఫిస్ ఫలితంతో సంబంధం లేకుండా జనాలకు ఎక్కేస్తాయి. ఎక్కడిదాకో ఎందుకు, గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి 2024లోనే టాప్ సాంగ్ అయ్యింది. దాన్ని స్వరపరిచింది తమనేగా. మొన్న పండక్కు తనే కంపోజ్ చేసిన డాకు మహారాజ్ కన్నా సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ ఛార్ట్ బస్టర్స్ ఎలా అయ్యాయి. వెంకటేష్ డాన్సుల వల్ల కాదుగా. భీమ్స్ సిసిరోలియో ట్యూన్ల వల్ల అనేది ఎవరైనా ఒప్పుకుంటారు. అంటే తమన్ లాజిక్ మిస్ అవుతున్నాడని అర్థమవుతోంది.
డిజాస్టర్ ఆల్బమ్స్ అందరికి ఉంటాయి. మాస్ట్రో ఇళయరాజా నుంచి ఆస్కార్ అందుకున్న కీరవాణిలు సైతం బాలేని పాటలు ఇచ్చిన దాఖలాలు బోలెడు. వాటిని కారణాలు ఏమైనా ఇతరుల మీదకు తోసేసిన ఉదంతాలు పెద్దగా కనిపించవు. కానీ తమన్ హీరో, కొరియోగ్రాఫర్ మీదను నెపం వేయడాన్ని చాలా మంది సమర్ధించలేకపోతున్నారు. ఇంకో సందర్భంలో అల వైకుంఠపురములో ఉదాహరణ చెప్పిన తమన్ గతంలో ఇచ్చిన ఫ్లాపుల గురించి ఎక్కడా గేమ్ ఛేంజర్ తరహాలో మాట్లాడలేదని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తమన్ ఆడుతున్న మాటల ‘గేమ్’ వ్యవహారాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తోంది.