ఆగస్ట్ 14 మీద ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ వార్ 2 ఆల్రెడీ ఆ డేట్ ని తీసుకోగా రజనీకాంత్ కూలి కూడా అదే తేదీ మీద కన్నేసిందన్న వార్త అభిమానులకు ఆందోళన కలిగించింది. ఎందుకంటే రెండూ ఒకేసారి తలపడటం బిజినెస్, ఓపెనింగ్స్ పరంగా ఎంత మాత్రం క్షేమం కాదు. కానీ తాజా అప్డేట్ ప్రకారం ఈ ప్యాన్ ఇండియా మూవీస్ క్లాష్ అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. వార్ 2 వాయిదా ప్రసక్తే లేదని, ఆ మేరకు యష్ రాజ్ ఫిలిమ్స్ తమ డిస్ట్రిబ్యూటర్లకు ముందస్తు సమాచారం ఇచ్చి థియేటర్లు బుక్ చేసే పనిలో ఉన్నట్టు ముంబై రిపోర్ట్.
దీన్ని దృష్టిలో కూలిని మరో తేదీకి తీసుకురావాలని చూస్తున్నట్టు చెన్నై టాక్. ఇంకా ఖరారు కానప్పటికీ వార్ 2 తో ఫేస్ అఫ్ ఉండదని బయ్యర్లకు స్పష్టత ఇవ్వడంతో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నట్టు తెలిసింది. కూలితో తలపడేందుకు ఎవరూ సాహసించకపోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కాంబినేషన్ రాష్ట్రంతో సంబంధం లేకుండా విపరీతమైన హైప్ తేనుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ సెట్ చేసిన తెలివైన క్యాస్టింగ్ అసలు హైప్ ని ఎంతపైకి తీసుకెళ్తుందో అర్థం కావడం లేదు. అందుకే రిలీజ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
కూలిని ఖచ్చితంగా ఆగస్ట్ లేదా ఆ తర్వాత రిలీజ్ చేస్తారనేది పక్కా. ఇందులో డౌట్ లేదు. కాకపోతే దసరా సీజన్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. దీపావళి స్లాట్ల మీద మెల్లగా ఇతర నిర్మాతలు కర్చీఫ్స్ వేస్తున్నారు. పోనీ డిసెంబర్ రజని పుట్టినరోజు వదులుదామంటే అంత ఆలస్యం కష్టం. పైగా ఓటిటి డీలింగ్ లో ఇబ్బందులొస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫిక్స్ చేయాలి. ది రాజా సాబ్, విశ్వంభర, స్వయంభు లాంటి చాలా సినిమాలు ఇదే సీజన్ లో వచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. మరి కూలి తొందరపడతాడో లేక నాకేం భయమంటూ కోరుకున్న తేదీని డిమాండ్ చేసి తీసుకుంటాడో వేచి చూడాలి.