ఒకప్పటి హీరో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీలో ఎంత ప్రతిభ ఉన్నా ఆ మధ్య రాజకీయాల వైపు వెళ్లిపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. పలువురు దర్శకులు ఆఫర్లు ఇచ్చినా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఆయన కెరీర్ ని కొత్త మలుపు తిప్పింది. మధ్య తరగతి తండ్రిగా అమాయకత్వం నిండిన పాత్రని పోషించిన తీరు జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. తాజాగా నాని నిర్మించిన కోర్ట్ లో విలన్ రూపంలో కొత్త ఎంట్రీ ఇచ్చారు. నిన్న వేసిన మీడియా ప్రీమియర్ తర్వాత అందరూ ముందు మంగపతి పాత్ర గురించే మాట్లాడుకోవడం గమనార్హం.
శివాజీ క్యారెక్టర్ తీరుతెన్నులు ట్రైలర్ లోనే చూపించిన దర్శకుడు రామ్ జగదీశ్ అసలు సినిమాలో దాన్ని డిజైన్ చేసిన విధానం పర్ఫెక్ట్ విలనిజంకి నిదర్శనంలా ఉంది. అమ్మాయిలని అతి జాగ్రత్తతో పెంచాలనే మూర్ఖత్వంతో పరువు కోసం ఎంతకైనా తెగించే మంగపతిగా శివాజీ పెర్ఫార్మన్స్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా హర్షవర్ధన్ కాంబినేషన్లో వచ్చే సీన్లు బాగా పేలాయి. అతిగా ఆవేశపడే మంగపతిగా తను చూపించిన ఇంటెన్సిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సరిగా వాడుకుంటే టాలీవుడ్ లో విలన్ల కొరతను తీర్చేవాడిగా రాబోయే రోజుల్లో మంచి ఆప్షన్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
శ్రీకాంత్, జగపతిబాబు ఇలాగే సెకండ్ ఇన్నింగ్స్ ని బ్రహ్మాండంగా మలుచుకున్నారు. 1997 చిరంజీవి మాస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన శివాజీ ఆ తర్వాత సోలో హీరోగా చెప్పుకోదగ్గ సినిమాలే చేశాడు. కాకపోతే సక్సెస్ రేట్ తక్కువ ఉండటంతో సపోర్టింగ్ రోల్స్ కు వచ్చాడు. 2010 తర్వాత నటించడం తగ్గించేసి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యాడు. ఇప్పుడు 90స్, కోర్ట్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సిరీస్, సినిమాల ద్వారా మళ్ళీ వెలుగులోకి రావడం విశేషం. ఇకపై యాక్టింగ్ కొనసాగిస్తానని చెబుతున్న శివాజీ అసలు తాను విలన్ గా ఫిట్ అవుతానని నాని నమ్మడమే ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు కానీ ఇప్పుడదే బ్రేకింగ్ పాయింట్ కావొచ్చు.