టాలీవుడ్ ప్యాన్ ఇండియా స్టార్లు ఇతర రాష్ట్రాలకు షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడి టూరిజానికి ఏ స్థాయి బూస్ట్ దక్కుతుందో చెప్పడానికి మరో ఉదాహరణగా ఎస్ఎస్ఎంబి 29 నిలుస్తోంది. తాజాగా ఒడిశా డిప్యూటీ సిఎం పార్వతి పరిదా తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ఇంకో తార్కాణం. గతంలో మల్కన్ గిరిలో పుష్ప 2 జరిగిందని, ఇప్పుడు కోరాపుట్ ప్రాంతంలో సౌత్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ తో పాటు అంతర్జాతీయంగా పేరు గడించిన ప్రియాంకా చోప్రా పాల్గొనడం ఒడిశా పర్యాటక రంగానికి ఎంతో మేలు చేయబోతోందని అక్కడి వనరుల గురించి ఆవిడ గర్వంగా చెప్పుకున్నారు.
ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే రాజమౌళి బృందం ఇప్పటిదాకా క్యాస్టింగ్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కేవలం లీకుల రూపంలోనే వార్తలు, ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ట్విట్టర్ లో తారాగణం పేరుతో పాటు లొకేషన్ వివరం కూడా చెప్పడం భలే ఉంది. మాములుగా ఒడిశాలో షూట్స్ జరిగేటప్పుడు విపరీతమైన జన సందోహం ఉండదు. కానీ కోరాపుట్ లో తెలుగు జనాభా ఎక్కువ. దానికి తోడు సౌత్ సినిమాలంటే అక్కడి పబ్లిక్ కి పిచ్చి. ఈ రెండు కలిసి మహేష్ 29 జరుగుతున్న చోట విపరీతమైన రద్దీని కలిగిస్తున్నాయి. చుట్టుపక్కల ట్రాఫిక్ ఏర్పడుతోంది.
ఏదైతేనేం ఏదో ఒక రూపంలో ఎస్ఎస్ఎంబి 29 నిత్యం వార్తల్లో నిలుస్తూ అప్డేట్స్ ఇస్తూనే ఉంది. ఏప్రిల్ లో ఒక ప్రెస్ మీట్ ద్వారా రాజమౌళి అన్ని వివరాలు ప్రకటిస్తారనే వార్తల నేపథ్యంలో మీడియాతో పాటు అభిమానులు దాని కోసమే ఎదురు చూస్తున్నారు. ఏదైనా వీడియో టీజర్ లాంటిది వదిలి దాని ద్వారానే టైటిల్ అనౌన్స్ చేయొచ్చనే టాక్ ఉంది కానీ జక్కన్న అన్నీ ఒకేసారి చేసే మార్కెటింగ్ బ్యాచ్ కాదు కాబట్టి ఎక్కువ ఆశించలేం. ప్రియాంకా చోప్రాది ప్రతినాయక ఛాయలున్న వేరే పాత్రని వినిపిస్తున్న నేపథ్యంలో అసలు హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. చూద్దాం చివరికి ఎవరొస్తారో.