‘గేమ్ చేంజర్’ కోసం 25 రోజులు డేట్లిస్తే..

లెజెండరీ తమిళ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి సహా చాలామంది స్టార్ హీరోలు ప్రయత్నించారు. కానీ ఆయన ప్రైమ్‌లో ఉండగా ఎవరికీ దొరకలేదు. చివరికి రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ మూవీ చేశారు. కానీ ఆ చిత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సంక్రాంతికి రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చాలామంది పేరున్న ఆర్టిస్టులు నటించినప్పటికీ.. సరైన పాత్రలు పడలేదు. తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రియదర్శి ‘మచ్చా మచ్చా రా’ పాటలో కొన్ని క్షణాలు మాత్రమే కనిపించి మాయం అయ్యాడు. అలాంటి నటుడిని ఇలాగేనా చూపించేది అని అందరూ ఆశ్చర్యపోయారు.

వాస్తవం ఏంటంటే.. ‘గేమ్ చేంజర్’ మూవీ కోసం ప్రియదర్శి 25 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నాడట. కానీ అతను నటించిన సీన్లన్నీ ఎడిటింగ్‌లో లేచిపోయాయట. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో అవకాశం అనగానే ఎగ్జైట్ అయ్యానని.. తనది చిన్న పాత్రే అయినా సంతోషంగా ఒప్పుకున్నానని ప్రియదర్శి చెప్పాడు. ‘బలగం’ కంటే ముందే ఈ సినిమా ఒప్పుకున్నట్లు వెల్లడించాడు. అప్పుడు తాను హీరో ఫ్రెండ్ పాత్రలే చేసేవాడినని.. ఇందులో కూడా అలాంటి పాత్రే ఇచ్చారని.. 25 రోజుల పాటు షూట్‌లో పాల్గొన్నానని ప్రియదర్శి తెలిపాడు. కానీ నిడివిని తగ్గించడంలో భాగంగా తన సీన్లన్నీ లేచిపోయానని.. అయినా సరే శంకర్ దర్శకత్వంలో నటించిన అనుభవం మాత్రం తనకు ప్రత్యేకమని ప్రియదర్శి తెలిపాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలన్నది తన కల అని.. అందుకోసం ఎంత ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదని ప్రియదర్శి చెప్పాడు. ‘ఆచార్య’లో ఓ పాత్ర కోసం తనను అడిగారని.. కానీ తర్వాత ఆ పాత్ర తీసేశారని.. ఆపై ‘వాల్తేరు వీరయ్య’లో తనకు ఛాన్స్ ఇవ్వమని దర్శకుడు బాబీని అడిగితే.. తనకు తగ్గ పాత్ర లేదని చెప్పాడని అన్నాడు. ‘భోళా శంకర్’లో ఛాన్స్ కోసం మెహర్ రమేష్‌ను అడిగినా కుదరలేదని.. ఇక అనిల్ రావిపూడి సినిమా కోసం కచ్చితంగా ప్రయత్నం చేస్తానంటూ మెగాస్టార్ మీద తన అభిమానాన్నిచాటుకున్నాడు దర్శి.