మ‌హేష్ అభిమానులు మురిసిపోయే మాట చెప్పాడు

Mahesh-babu-Parasuram

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌ర్వాతి సినిమా విష‌యంలో స‌స్పెన్సుకు తెర‌ప‌డ్డ‌ట్లే. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత‌ వంశీ పైడిప‌ల్లితో చేయాల్సిన సినిమాను క్యాన్సిల్ చేసుకున్న మ‌హేష్‌.. ప‌ర‌శురామ్ సినిమాను ఓకే చేసిన‌ట్లే చేసి.. త‌ర్వాత ఆ చిత్రంపై సందేహాలు క‌లిగేలా చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ కాంబినేష‌న్లో సినిమా గురించి ఇప్ప‌టిదాకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. మ‌హేష్ కానీ.. ప‌ర‌శురామ్ కానీ ఈ సినిమా గురించి మాట్లాడ‌లేదు. మ‌రోవైపు క‌థ‌లో మార్పులు జ‌రుగుతున్న‌ట్లు.. సినిమా ఇంకా ఖ‌రారు కాన‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి. ఐతే ఇప్పుడు స్వ‌యంగా ప‌ర‌శురామే ఈ సినిమా గురించి ఓ ఇంట‌ర్వ్యూలో ధ్రువీక‌రించాడు.

మ‌హేష్ బాబు న‌టించిన ఒక్క‌డు సినిమా తాను సినిమాల్లోకి రావ‌డానికి స్ఫూర్తిగా నిలిచింద‌ని.. మ‌హేష్‌తో సినిమా చేయాల‌ని తాను ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నాన‌ని.. చివ‌రికి త‌న క‌ల నెర‌వేర‌బోతోంద‌ని ప‌ర‌శురామ్ అన్నాడు. అద్భుత‌మైన స‌బ్జెక్టుతో మ‌హేష్ సినిమా తెర‌కెక్క‌బోతోంద‌ని.. సూప‌ర్ స్టార్ కెరీర్లో ఇదో మైలురాయిలా నిలుస్తుంద‌ని ప‌ర‌శురామ్ ధీమా వ్య‌క్తం చేశాడు.

తాను ఎలివేష‌న్ సీన్లు రాయ‌లేక ఏమీ కాద‌ని.. త‌న గ‌త సినిమాల్లో అందుకు పెద్దగా అవ‌కాశం రాలేద‌ని.. మ‌హేష్ సినిమాలో అలాంటి సీన్ల‌కు ఢోకా ఉండ‌ద‌ని.. ప‌ర‌శురామ్ చెప్ప‌డం సూప‌ర్ స్టార్ అభిమానుల్ని ఎగ్జైట్ చేసేదే. ప‌ర‌శురామ్ ఇచ్చిన ఎలివేష‌న్‌తో మ‌హేష్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకుంటార‌న‌డంలో సందేహం లేదు. 14 రీల్స్ ప్ల‌స్ బేన‌ర్ మీద రామ్ ఆచంట‌, గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తార‌ని స‌మాచారం.