చిన్ననాటి స్నేహితుడితో హిరోయిన్ నిశ్చితార్థం

ప్రస్తుతం రీ రిలీజ్‌తో సందడి చేస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రమే కాక కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, గామి… ఇలా పలు తెలుగు సినిమాల్లో నటించిన తమిళ అమ్మాయి అభినయ విశిష్ఠత గురించి తెలిసిందే. ఆమెకు మాటలు రావు. చెవులు కూడా సరిగా వినిపించవు. అయినా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, కష్టపడి నటిగా ఎదిగింది. ఆమె నటించిన చిత్రాల్లో తన నటన చూస్తే తను మూగ అమ్మాయి అనే భావన రవ్వంతైనా కలగదు. మాటలు రాకపోయినా.. ఆమె పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సైగల ద్వారానే తాను ఏం చెప్పాలనుకున్నది కన్వే చేస్తుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అభినయ.. తాజాగా ఒక స్వీట్ న్యూస్ చెప్పింది. తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని వెల్లడించింది.

తన చిన్ననాటి స్నేహితుడిని వివాహమాడబోతున్నానని.. తమది 15 ఏళ్ల బంధం అని ఆమె తెలిపింది. తనకు కాబోయే వరుడితో కలిసి గుడి గంట కొడుతున్న నిశ్చితార్థం ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో చేతులు, గంట మాత్రమే కనిపిస్తున్నాయి. వరుడెవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. పెళ్లి సమయానికి ఫొటోలు బయటికి వస్తాయేమో. అభినయ గతంలో తెలుగువాడైన తమిళ యాక్షన్ హీరో విశాల్‌తో ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రచారాన్ని అభినయ ఖండించింది.

విశాల్ తనకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. అయినా మీడియాలో వీరి రిలేషన్‌షిప్ గురించి వార్తలు ఆగలేదు. ఐతే ఇప్పుడు తన పెళ్లి గురించి సమాచారం ఇచ్చి ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టించేసింది అభినయ. ఆమె కీలక పాత్ర పోషించిన మలయాళ చిత్రం ‘పని’ బ్లాక్ బస్టర్ అయింది. జోజు జార్జ్‌ ఈ చిత్రంలో అభినయకు జోడీగా లీడ్ రోల్ చేయడంతో పాటు డైరెక్ట్ చేశాడు కూడా.