సమంత కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘ఓ బేబీ’ ఒకటి. ఒక కొరియన్ మూవీకి రీమేక్ అయినప్పటికీ… మన నేటివిటీకి తగ్గట్లు చాలా బాగా ఈ సినిమా తీసి మెప్పించింది నందిని రెడ్డి. సమంతతో ఆమె చేసిన తొలి చిత్రం ‘జబర్దస్త్’ డిజాస్టర్ అయినప్పటికీ.. ‘ఓ బేబీ’ మాత్రం ఒక క్లాసిక్‌గా నిలిచింది. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని నందిని రెడ్డి వెల్లడించింది. సమంతతో మళ్లీ తాను ఓ సినిమా తీస్తున్నట్లు ఆమె ప్రకటించింది.
ఐఫా వేడుకలో ‘సినిమాల్లో మహిళలు’ అనే టాపిక్ మీద మాట్లాడుతూ.. సమంత గురించి ప్రస్తావించిన నందిని రెడ్డి, తమ కలయికలో మళ్లీ ఓ సినిమా రాబోతున్న విషయాన్ని ధ్రువీకరించింది. అంతే కాక సమంత ప్రొడక్షన్లో ప్రకటించిన ‘మా ఇంటికి బంగారం’ మూవీకి సంబంధించి అప్‌డేట్ కూడా ఇచ్చింది నందిని. ఎప్పుడో ప్రకటించినా, తర్వాత అతీగతి లేకుండా పోయిందీ సినిమా. ఐతే దీని షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు నందిని తెలిపింది. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ మహిళలు, పురుషులు అని తేడా లేకుండా సమంత సమాన వేతనం ఇస్తోందని నందిని చెప్పింది.
సినీ రంగంలో మహిళలు, పురుషుల మధ్య ఉండే తేడాల గురించి మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించింది. తమ సినిమాలకు మంచి నిర్మాతలు దొరకాలంటే పురుషుల కంటే మహిళలు రెండింతలు నిరూపించుకోవాలని నందిని వ్యాఖ్యానించింది. ఒక పురుష దర్శకుడు 4 ఏళ్లలో సాధించేది, ఒక లేడీ డైరెక్టర్ సాధించాలంటే 8 ఏళ్లు పడుతోందని.. ఇందులో వేతన వ్యత్యాసం కూడా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.