వైజయంతి కొడుకుది పెద్ద నేపథ్యమే

డెవిల్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్ చేసిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇటీవలే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసిన టీమ్ విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదు. వేసవి స్లాట్లన్నీ బిజీగా ఉండటంతో వీలైనంత సోలో డేట్ సంపాదించేందుకు ఆప్షన్లు చూస్తోంది. టైటిల్ కోసం పెద్ద కసరత్తే చేశారు. ముందు అనుకున్న మెరుపు వద్దనుకుని విజయశాంతి పోషించిన వైజయంతి పాత్ర పేరు వచ్చేలా పెట్టడం వెనుక కళ్యాణ్ రామ్ ఒత్తిడే ఎక్కువ ఉందని సమాచారం. రెగ్యులర్ కమర్షియల్ ఫీలింగ్ రాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారట.

అసలు వైజయంతి పేరుకి పెద్ద చరిత్ర ఉంది. 1990లో విజయశాంతి కెరీర్ ని మలుపు తిప్పిన కర్తవ్యంలో ఆవిడ పేరు అదే. ఈ సినిమా ఎంతగా పాపులరంటే అప్పట్లో ఆడపిల్లలకు ఈ పేరు పెట్టేందుకు తల్లితండ్రులు ముచ్చటపడేంత. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కర్తవ్యంలో యువతిగా ఉన్న వైజయంతికి తర్వాత పెళ్ళై కొడుకు పుట్టి అర్జున్ అని పేరు పెట్టుకున్నాక అతను చట్టం ముందు దోషిగా నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందనే ఆలోచన మీద దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ కథ రాసుకున్నారట. సరిలేరు నీకెవ్వరు తర్వాత నటించనని చెప్పిన లేడీ అమితాబ్ ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదేనట.

సో ఒకప్పుడు బాబాయ్ బాలకృష్ణతో ఎన్నో బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకున్న విజయశాంతి ఇప్పుడు తనకు తల్లిగా నటించడం పట్ల కళ్యాణ్ రామ్ సెంటిమెంట్ గా కూడా ఫీలవుతున్నాడు. నలభై కోట్ల దాకా బడ్జెట్ అయ్యిందని వినికిడి. థియేటర్ బిజినెస్ కోణంలో కాకుండా కంటెంట్ డిమాండ్ చేయడం వల్లే అంత ఖర్చు పెట్టారని, ప్రేక్షకులను మెప్పిస్తే సులభంగా వెనక్కు తెస్తుందనే నమ్మకం నిర్మాతలకు వచ్చేసిందట. బింబిసార తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు కళ్యాణ్ రామ్ కు దక్కలేదు. అమిగోస్, డెవిల్ రెండూ నిరాశపరిచాయి. అందుకే అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద శ్రద్ధ తీసుకుంటున్నారు.