బాలీవుడ్ సీనియర్ కథానాయకుడు ఆమిర్ ఖాన్ కెరీర్లో చాలా స్పెషల్ మూవీగా ‘లగాన్’ను చెప్పుకోవాలి. అప్పటిదాకా ఆమిర్ స్టార్ మాత్రమే. ఈ చిత్రంతో సూపర్ స్టార్ అయిపోయారు. ఆమిర్ సినిమాలంటే వేరే లెవెల్ అనే అభిప్రాయం ‘లగాన్’ నుంచే మొదలైంది. 2001లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటికి ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. ఆమిర్ కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ చిత్రం మీద విడుదలకు ముందు తనకు నమ్మకాలు లేవట. ఒక సెంటిమెంట్ కారణంగా ఈ సినిమా ఆడదేమో అని అతను భయపడ్డాడట. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అంతకుముందు ఆయన వాయిస్ ఇచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండడంతో ఇది కూడా వాటి జాబితాలోనే చేరుతుందేమో అని ఆమిర్ అనుకున్నాడట. కానీ ఆశ్చర్యకరంగా ఈ సినిమా పెద్ద హిట్ అయి తనకు షాకిచ్చిందని ఆమిర్ తెలిపాడు. ‘‘లగాన్ రిలీజ్ ముంగిట నేను చాలా భయపడ్డాను. ‘నువ్వు ఏ ధైర్యంతో ఈ సినిమా తీస్తున్నావు. ఇది ఒక్క రోజు కూడా ఆడదు’ అంటూ ఇండస్ట్రీ జనాలు నా మొహం మీదే అన్నారు. నిజానికి ఆ సమయంలో క్రికెట్ నేపథ్యంలో వచ్చిన మంచి మంచి సినిమాలు కూడా ఆడలేదు. పైగా అమితాబ్ జీ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు కూడా కొన్ని తీవ్రంగా నిరాశపరిచాయి.
అమితాబ్ గాత్రదానం చేస్తే సినిమా ఫ్లాప్ అని అందరూ అనుకునేవారు. నేను కూడా ఆ సెంటిమెంట్ విషయంలో భయపడ్డాను. నా సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు. కానీ నా అంచనాలను తలకిందులు చేస్తూ ‘లగాన్’ పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో నేను చాలా బాగా నటించానని అప్పుడు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు చూస్తే ఇంకా బెటర్‌గా చేయాల్సిందని అనిపిస్తుంది’’ అని ఆమిర్ తెలిపాడు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఆమిర్ ఖానే స్వయంగా ‘లగాన్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇందులో ఆమిర్ సరసన ‘సంతోషం’ హీరోయిన్ గ్రేసీ సింగ్ నటించింది.