సంగీత దర్శకుడు, హీరోగా రెండు పడవల ప్రయాణం చేస్తున్న జివి ప్రకాష్ కుమార్ మనకు మ్యూజిక్ ద్వారానే ఎక్కువ పరిచయం. డార్లింగ్, సార్ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ ఆల్బమ్స్ టాలీవుడ్ కు ఇచ్చాడు. అయితే తను కథానాయకుడిగా ఇప్పటికే పాతిక సినిమాలు పూర్తి చేశాడంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. నిన్న కింగ్స్టన్ రిలీజయ్యింది. తెలుగు వెర్షన్ మైత్రి పంపిణి చేయడంతో చెప్పుకోదగ్గ థియేటర్లు దొరికాయి. నితిన్ తో పాటు పలువురు ప్రముఖులు ముఖ్యఅతిథులుగా ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ట్రైలర్ చూస్తే ప్యాన్ ఇండియా బడ్జెట్ కనిపించింది. కానీ ఏం లాభం అంటున్నారు ఫాన్స్.
ఎందుకో చూద్దాం. తమిళనాడులో ఒక సముద్ర తీరం ప్రజలు నలభై మూడు సంవత్సరాలు వేటకు దూరంగా ఉంటారు. తాము చేసిన ఒక తప్పు వల్ల ఊళ్ళో జనాలు వరసగా చనిపోతున్నారని భావించి కులవృత్తి మానేసి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడతారు. వాళ్లలో ఒకడే కింగ్స్టన్ అలియాస్ కింగ్ (జివి ప్రకాష్ కుమార్). అనుకోని సంఘటన వల్ల స్నేహితుడు చనిపోవడంతో సముద్రంలో దెయ్యాలు లేవని భావించి దాన్ని బయట పెట్టే లక్ష్యంతో ప్రాణాలు పణంగా పెట్టి పడవేసుకుని వెళ్తాడు. అంతుచిక్కని రహస్యంగా మారిన సంద్రం గుట్టుని తవ్వి తీస్తాడు. అది ఎలా చేశాడనేది తెరమీద చూడాలి.
దర్శకుడు కమల్ ప్రకాష్ పేపర్ మీద రాసుకున్నంత డెప్త్ గా కంటెంట్ ని తెరకెక్కించలేకపోయాడు. కెజిఎఫ్, దేవర లాంటి బ్లాక్ బస్టర్ల స్ఫూర్తితో ఒక వెరైటీ సబ్జెక్టు ఎంచుకున్నాడు కానీ స్క్రీన్ ప్లేని ఎంగేజింగ్ గా మార్చుకోవడంలో పడిన తడబాటు కింగ్స్టన్ ని బోరింగ్ గా మార్చేసింది. కథని ముందుకు వెనక్కు నడిపిస్తూ ఆవసరం లేని అయోమయాన్ని సృష్టించిన కమల్ ప్రకాష్ కీలకమైన హారర్ ఎలిమెంట్ ని చాలాసేపు సాగతీత తర్వాత ప్రవేశపెట్టడం తేడా కొట్టేసింది. జివితో పాటు ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ పరంగా ఎలాంటి లోపం లేకపోయినప్పటికీ మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో కింగ్స్టన్ ఫెయిలయ్యాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates