నిన్న జరిగిన కోర్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాతగా నాని తన సినిమా మీద చూపించిన నమ్మకం ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. కోర్ట్ ఖచ్చితంగా మీకు నచ్చుతుందని, ఒకవేళ అలా అనిపించకపోతే ఇంకో రెండు నెలల్లో వచ్చే తన హిట్ 3 ది థర్డ్ కేస్ చూడొద్దంటూ పబ్లిక్ స్టేజి మీద చెప్పడం అనూహ్య పరిణామం. గతంలో హీరోలు ఇలాంటి సవాళ్లు విసిరారు కానీ వాళ్లంతా వైరల్ కావాలనే ఉద్దేశంతో, హైప్ కోసమే అన్నారు తప్పించి నాని రేంజ్ స్టార్ ఇంత ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇవ్వడం అరుదు. అందులోనూ ప్రత్యేకంగా హైప్ పెంచాలనే ప్రయత్నాలకు నాని సహజంగా దూరంగా ఉంటాడు.
ఈ లెక్కన కోర్ట్ కంటెంట్ మాములుగా ఉండబోవడం లేదనేది అర్థమవుతోంది. బాలీవుడ్ లాగా తెలుగులో కోర్ట్ డ్రామాలు అంతగా ఆడిన దాఖలాలు తక్కువ. ముప్పై సంవత్సరాల క్రితం హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దామిని ఇక్కడ ఊర్మిళగా రీమేక్ చేస్తే సూపర్ ఫ్లాప్ అయ్యింది. వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ కాకుండా వేరే హీరో చేసి ఉంటే ఇంత ఫలితం దక్కేది కాదనేది ఓపెన్ సీక్రెట్. జాలీ ఎల్ఎల్బిని సప్తగిరితో తీస్తే ఆడలేదు. జాలీ ఎల్ఎల్బి 2ని పలుమార్లు వెంకటేష్ చేద్దామనుకుని డ్రాప్ అయ్యారు. రుస్తుం, ముల్క్, సెక్షన్ 375 లాంటివి డబ్బింగ్ కు పరిమితమయ్యాయి తప్పించి రీమేక్ సాహసాలు చేయలేదు.
మరి కోర్ట్ లో అన్ని వర్గాలను మెప్పించేలా ఏముంటుందనే ప్రశ్నకు సమాధానం మూడు నిమిషాల ట్రైలర్ లో చెప్పేశారు కానీ అసలు కంటెంట్ వేరే లెవెల్ లో షాకిచ్చే స్థాయిలో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఆ నమ్మకంతోనే నాని అంత పబ్లిక్ గా బాలేదనిపిస్తే హిట్ 3 చూడొద్దని పిలుపు ఇవ్వడుగా. మార్చి 14 విడుదల కాబోతున్న కోర్ట్ మంచి టైంలో వస్తోంది. పోటీ పెద్దగా లేదు. మార్చి మొదటి వారం కొత్త రిలీజులు తుస్సుమనిపించాయి. కిరణ్ అబ్బవరం దిల్ రుబా తప్ప వేరే కాంపిటీషన్ లేదు. ఇవన్నీ పక్కనపెడితే రెండు మూడు రోజుల ముందే ప్రీమియర్లు వేసేందుకు నాని ప్లాన్ చేయడం తన కాన్ఫిడెన్స్ కు మరో సాక్ష్యం.