రాజా సాబ్ వెనుక ఏం జరుగుతోంది

ఏప్రిల్ 10 విడుదల తేదీని వద్దనుకున్నాక ది రాజా సాబ్ కొత్త డేట్ కోసం అభిమానుల ఎదురు చూపులు కొనసాగుతున్నాయి తప్పించి టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పోనీ కీలకమైన వేసవి సీజన్ ఉంది కదా, దీన్నేమైనా వాడుకుంటారా అంటే ఆ సూచనలు లేవు. బాహుబలి 1 ది బిగినింగ్ వచ్చిన జూలై 24 బాగుంటుందనుకుంటే దర్శకుడు మారుతీ లిస్టులో అసలా ఆప్షనే లేదట. సో అయితే దసరా లేదా దీపావళి అనేది ముందున్న టార్గెట్. కానీ వీటికి కూడా గ్యారెంటీ లేదు. కారణం పెండింగ్ ఉన్న వర్క్ ఎంత టైంలో అయిపోతుందనే స్పష్టమైన కంక్లూజన్ రాజా సాబ్ టీమ్ లో లేకపోవడమే.

కీలకమైన ఇంకో మూడు పాటలు బ్యాలన్స్ ఉన్నాయట. వాటిని హడావిడిగా షూట్ చేయడం కుదరదు. హీరోయిన్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఇతర కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారు కాబట్టి కాంబినేషన్ కాల్ షీట్లు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇదంత సులభంగా అయ్యే వ్యవహారం కాదు. మరోవైపు ఇప్పటిదాకా సిద్ధమైన భాగానికి సంబంధించిన ఫుటేజ్ మూడున్నర గంటల దాకా వచ్చిందట. దీన్ని ఎడిటింగ్ చేయడం సవాల్ గా మారిందని సమాచారం. కమర్షియల్ సినిమాలకు ఓకే కానీ హారర్ కామెడీకి ఇంత నిడివి అంటే ఖచ్చితంగా సమస్యే. ఎంత ప్రభాస్ ఉన్నా సరే లేనిపోని రిస్క్ అవుతుంది.

సో ఇదంతా ఒక సుడోకు పజిల్ ని తలపిస్తోంది. లేదా రూబిక్స్ క్యూబ్ అనుకోవచ్చు. 2025 ద్వితీయార్థంలో విశ్వంభర, స్వయంభు, అఖండ 2 తాండవం, సంబరాల ఏటిగట్టు, కాంతారా చాప్టర్ 1, కాంత, ఓజి లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ బోలెడున్నాయి. వీటితో క్లాష్ కాకుండా సోలో డేట్ కావాలనేది రాజా సాబ్ లక్ష్యం. పైగా బాలీవుడ్ రిలీజులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బాహుబలి తర్వాత సాహో నుంచి కల్కి దాకా ప్రభాస్ వచ్చింది సింగల్ గానే. అలా అయితేనే బడ్జెట్ రికవరీలు వేగంగా జరుగుతాయి. మరి రాజా సాబ్ ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో కాలమే సమాధానం చెప్పాలి.