ఒకప్పుడు శోభన్ బాబు, జగపతిబాబు లాంటి హీరోలు ఇద్దరు భామల మధ్య నలిగిపోయే ప్రియులు, భర్తలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. దేవత, ఆయనకి ఇద్దరు, శుభలగ్నం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే వస్తుంది. అయితే గత కొంత కాలంగా ఈ పాయింట్ ని మన స్టార్లు పెద్దగా టచ్ చేయడం లేదు. సింగల్ హీరోయిన్ కి ప్రాధాన్యం ఇచ్చేలా దర్శకులు కథలు రాస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం దీన్ని బ్రేక్ చేసి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు నాటి వింటేజ్ వెంకీని బయటికి తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది. త్వరలో శర్వానంద్ నారి నారి నడుమ మురారితో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
ఇప్పుడు రవితేజ కూడా ఈ కోవలోకి చేరుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందబోయే ఫ్యామిలి కామెడీ డ్రామాలో ఇద్దరు కథానాయికలు ఉంటారట. మమిత బైజు, కోయదు లోహర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అసలు ప్రాజెక్టే ప్రకటించనప్పటికీ ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. బివిఎస్ రవి అందించిన కథ వన్ జెంట్ టూ లేడీస్ తరహాలో ఉంటుందని వినికిడి. ప్రస్తుతానికి ఫైనల్ నెరేషన్ అవ్వలేదు. మాస్ జాతరలో బిజీగా ఉన్న రవితేజ ఈ నెలాఖరులోగా దీన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓకే అనుకుంటే అయిదు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తారట.
ఇంకొద్ది రోజులు ఆగితే దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు. వరస ఫ్లాపులతో డీలా పడ్డ అభిమానులకు మాస్ జాతరతో రవితేజ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. సితార నిర్మాణం, శ్రీలీల గ్లామర్, భీమ్స సంగీతం లాంటి గ్యారెంటీ హిట్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇక కిషోర్ తిరుమల విషయానికి వస్తే 2022లో శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఊహించని విధంగా ఫ్లాప్ కావడంతో గ్యాప్ వచ్చేసింది. మూడేళ్ళ నిరీక్షణకు న్యాయం చేకూరుస్తూ రవితేజతో కనక ఓకే అయితే మళ్ళీ ట్రాక్ లో పడేందుకు మంచి ఛాన్స్ దొరికినట్టు అవుతుంది. చూడాలి ఏం చేస్తారో.