శ్రవణానందం అంటే చెవులకు ఇంపుగా ఉందని అర్థం. ఇప్పుడీ వార్త చూస్తే కొందరు అదే ఫీలవుతారు. 2023 ఏప్రిల్ లో విడుదలైన ఏజెంట్ ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. ఇది ఎంత పెద్ద డిజాస్టర్ అంటే అభిమానులు డిజిటల్ లో రాకపోతేనే సంతోషం అనుకున్నారు. దీని ఫలితం దెబ్బకే అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని కొత్త సినిమా లెనిన్ మొదలుపెట్టాడు. అది కూడా సంవత్సరంన్నరకు పైగా ఖాళీగా ఉండి. దర్శకుడు సురేందర్ రెడ్డి, ప్రత్యేక పాత్ర చేసిన మలయాళం స్టార్ మమ్ముట్టి ఇలా ప్రతి ఒక్కరికి పీడకలలా నిలిచిపోయిన ఏజెంట్ ఎట్టకేలకు సోని లివ్ ఓటిటిలో మార్చి 14 స్ట్రీమింగ్ చేయనుందని లేటెస్ట్ అప్డేట్.
గతంలోనూ ఇలా వస్తుందని ఊరించి ఊరించి చాలాసార్లు వాయిదా వేశారు. ఇప్పుడు కూడా గ్యారంటీనా అంటే సందేహం వద్దంటున్నాయి మీడియా వర్గాలు. థియేటర్ రిలీజ్ డేట్ నుంచి లెక్క వేసుకుంటే ఏజెంట్ వచ్చే వారానికి 685 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తో గత పది పదిహేను సంవత్సరాల్లో ఏ సినిమా ఓటిటిలో రాలేదంటే ఆశ్చర్యం వేసినా అదే నిజం. స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఏజెంట్ కథా కథనాలు మరీ అత్తెసరుగా ఉండటంతో పరాజయం తప్పలేదు. నిర్మాత అనిల్ సుంకర పెట్టిన ఖర్చు గురించి అప్పట్లో లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి.
ఇంత చేసి ఏజెంట్ ఫలితం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. సరే జరిగిందేదో జరిగింది ఇప్పటికైనా మోక్షం దక్కించుకున్నందుకు సంతోషం అనుకోవాలి. ఆర్థిక కారణాలు, కోర్టు కేసుల వల్ల ఇంత ఆలస్యం అయ్యింది కానీ లేదంటే ఏజెంట్ నాలుగైదు వారాలకే వచ్చేసేది. హిందీ డబ్బింగ్ వెర్షన్ ని గత ఏడాది గోల్డ్ మైన్స్ శాటిలైట్ ఛానల్ లో ప్రీమియర్ చేశారు. కంటెంట్ మీద ట్రోలింగ్ కూడా బాగానే జరిగింది. పాత ఫ్లాపులకు కొత్తగా కల్ట్ అనే ముద్ర వేసినట్టు ఏజెంట్ ఇప్పుడు బుల్లితెరపై ఎవరికైనా నచ్చి షాక్ ఇస్తుందేమో చూడాలి. ఏమో సోషల్ మీడియా ట్రెండ్స్ బహు విచిత్రంగా ఉంటాయి మరి.