మాస్ రాజా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం.. ధమాకా. మిక్స్డ్ టాక్, యావరేజ్ రివ్యూస్‌తో మొదలైన ఈ చిత్రం.. ఎవ్వరూ ఊహించని విధంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఐతే టాక్, రివ్యూలు గొప్పగా లేకపోయినా తట్టుకుని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి ఇందులోని పాటలు, శ్రీలీల గ్లామర్-డ్యాన్సులు ముఖ్య కారణం అనే చర్చ అప్పట్లో జరిగింది. ఇదే మాట ఆ సినిమా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ దగ్గర ప్రస్తావిస్తే అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కేవలం హీరోయిన్ గ్లామర్, డ్యాన్సుల వల్ల సినిమా ఆడేస్తుందా అని అతను ప్రశ్నించాడు.
శ్రీలీల ‘ధమాకా’ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది కదా.. వాటిలోనూ అందంగా కనిపించింది, అదిరిపోయే డ్యాన్సులూ వేసింది.. మరి అవన్నీ హిట్టయ్యాయా అని అతను ప్రశ్నించాడు. ఏ సినిమా అయినా బాగా ఆడిందీ అంటే అందుకు ప్రధాన కారణం కథేనని ప్రసన్న కుమార్ అభిప్రాయపడ్డాడు. ఒక సినిమాలో పాటు మహా అయితే 20 నిమిషాలు ఉంటాయని.. ఆ 20 నిమిషాలు ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ వస్తే సినిమా ఆడేస్తుందా అని అతను ప్రశ్నించాడు. మిగతా రెండు గంటల పాటు కథను ఆసక్తికరంగా నడిపిస్తేనే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారని అతనన్నాడు.
కథ బాగుండి అది సినిమాను డ్రైవ్ చేస్తే.. హీరోయిన్ గ్లామర్, డ్యాన్సులు లాంటివి బోనస్ అవుతాయని.. సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లడానికి తోడ్పడతాయని ప్రసన్న అభిప్రాయపడ్డాడు. అంతే తప్ప హీరోయిన్ గ్లామర్, డ్యాన్సులతో ఏ సినిమా ఆడదన్నాడు. ‘ధమాకా’లో ఎంటర్టైన్మెంట్ బాగా కుదిరిందని అతనన్నాడు. ఈ చిత్రంలో ముందు హైపర్ ఆది పాత్రే లేదని.. కానీ తన కామెడీ టైమింగ్ నచ్చి రవితేజ తన మీద కొన్ని సీన్లు రాయమంటే అలా తన పాత్రను యాడ్ చేశామని.. అది బాగా వర్కవుట్ అయిందని ప్రసన్నకుమార్ తెలిపాడు.