మ‌న‌వ‌డి అప్పు.. శివాజీ గ‌ణేశన్ ఇల్లు జ‌ప్తు..!

“సినీ అవ‌కాశాలు నాకు చాలా వేగంగా వ‌చ్చాయ‌ని కొంద‌రు భావిస్తారు. కానీ, అది త‌ప్పు. ప్లాట్ ఫారాల‌పై ప‌డుకున్న రోజులు.. నిద్ర‌లేని రాత్రులు.. నాకు అనేకం ఉన్నాయి. అవి ఇప్ప‌టికీ నాకు క‌నిపిస్తూనే ఉన్నాయి. నా క‌ళ్ల‌లో మెదులు తూనే ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కానే త‌ప్ప‌.. ఏ నిచ్చెన‌లూ ఆశ్ర‌యించ‌లేదు“- త‌మిళ‌నాడుకు చెందిన మ‌హాన‌టుడు శివాజీ గ‌ణేశ‌న్‌.. త‌న స్వీయ చ‌రిత్ర‌లో రాసుకున్న కీల‌క ఘ‌ట్టం ఇది!! అంత పేరు ప్ర‌ఖ్యాతులు సంపాయించుకున్న న‌డిగ‌ర్ తిల‌గం(న‌ట తిలకం) ఇంటిని తాజాగా తమిళ‌నాడు హైకోర్టు జ‌ప్తు చేయాల‌ని సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది.

ఏం జ‌రిగింది?

మ‌హాన‌టుడు శివాజీ గ‌ణేశ‌న్ ఎంతో క‌ష్టప‌డి సంపాయించుకున్న పేరును ఆయ‌న పెద్ద కుమారుడు రామ్ కొడుకు.. దుష్యంత్ న‌డిరోడ్డున ప‌డేశాడ‌ని త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు వాపోతున్నారు. దుష్యంత్ త‌న స‌తీమ‌ని అభిరామితో క‌లిసి `ఈశాన్ ప్రొడ‌క్ష‌న్స్` పేరుతో సినీ నిర్మాణ సంస్థ‌ను నెల‌కొల్పారు. అయితే.. ఈ సంస్థ అప్పుల్లోనూ.. న‌ష్టాల్లోనూ సాగుతోంది. అయితే.. ఈ ఒక్క సినిమా తీసి.. న‌ష్టాలు పూడ్చుకుందామ‌న్న ఆశ‌తో.. శివాజీ మ‌న‌వడు దుష్యంత్ త‌ప్పులో కాలేశారు. `ధ‌న‌భాగ్యం ఎంట‌ర్ ప్రైజెస్‌` అనే సంస్థ నుంచి 3.74 కోట్ల రూపాయ‌ల‌ను ఏడాదికి 30 శాతం వ‌డ్డీ చెల్లించేలా(అంటే నెల‌కు వంద‌కు రూ.2.25 వ‌డ్డీ) అప్పుగా తీసుకున్నారు.

ఈ సొమ్ముతో `జ‌గ‌జాల కిల్లాడి`(జ‌గ‌డాల‌మ్మాయి) సినిమాను ప్రారంభించారు. అయితే.. ఈ క్ర‌మంలో తీసుకున్న సొమ్మును స‌మ‌యానికి చెల్లించ‌లేదు. పైగా సినిమా పూర్తి కాకుండానే పూర్త‌యింద‌ని న‌మ్మించారు. దీంతో ఏళ్లు గ‌డిచినా సొమ్ము చెల్లించ‌క‌పోవ‌డంతో అప్పు ఇచ్చిన ధ‌న‌భాగ్య సంస్థ కోర్టును ఆశ్ర‌యించింది. దీంతో మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. అక్క‌డ కూడా.. దుష్యంత్ అబ‌ద్దాలాడారు. సినిమాను ధ‌న‌భాగ్య సంస్థ‌కు ఇచ్చేయాల‌ని.. అప్పు తీర‌గా వ‌చ్చిన సొమ్మును తీసుకోవాల‌ని మ‌ధ్య‌వ‌ర్తి చెప్పారు.

కానీ, అస‌లు సినిమానే పూర్తికాలేద‌ని దుష్యంత్ అప్పుడు ఒప్పుకొన్నాడు. రూ.3.74 కోట్ల‌ను ఇత‌ర అప్పులు తీర్చుకునేందుకు వినియోగించాన‌ని పేర్కొన్నాడు. దీంతో కేసుపై హైకోర్టు తీవ్రంగా మండిప‌డింది. కోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించ‌డంతోపాటు.. సొమ్ము ను ఎగ‌వేసే ఉద్దేశం క‌నిపిస్తోంద‌న్న మ‌ధ్య‌వ‌ర్తి ఇచ్చిన నివేదిక‌తో ఏకీభ‌వించిన కోర్టు.. దుష్యంత్‌కు ఉమ్మ‌డి ఆస్తిగా ద‌క్కిన తాత గారి(శివాజీ గ‌ణేశ‌న్) ఇంటిని జ‌ప్తు చేయాల‌ని .. ఆ ఇంటికి తాళాలు వేయాల‌ని ఆదేశించింది. దీంతో అధికారులు శివాజీ గ‌ణేశ‌న్ ప్రాణ ప్ర‌దంగా భావించిన ఇంటికి తాళాలు వేశారు. ఈ ప‌రిణామాల‌పై త‌మిళ‌నాట ఆవేద‌న‌, ఆగ్ర‌హం రెండూ వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.