హనుమాన్ మూవీతో తిరుగులేని క్రేజ్ సంపాదించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ క్రేజ్ కేవలం ప్రేక్షకుల్లో మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీలో కూడా అతడికి ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. తనతో సినిమా చేయడానికి చాలామంది నిర్మాతలు, హీరోలు లైన్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని క్రేజీ కాంబినేషన్లు కుదిరేలా కనిపించాయి. ప్రశాంత్ నుంచి వరుసగా ఒక్కో ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతూ వచ్చింది.
కానీ తన సినిమాలు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప కార్యరూపం దాల్చలేదు. ముందు రణ్వీర్ సింగ్‌తో అనుకున్న బ్రహ్మ రాక్షస అంతా ఓకే అనుకున్నాక క్యాన్సిల్ అయిపోయింది. నందమూరి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ తీయాల్సిన సినిమా ముహూర్త వేడుక ముంగిట వెనక్కి వెళ్లిపోయింది. మహంకాళి అని ప్రశాంత్ స్క్రిప్టుతో రూపొందాల్సిన మరో చిత్రం గురించి కూడా ఏ అప్‌డేట్ లేదు. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ఇప్పుడిప్పుడే సెట్స్ మీదికి వెళ్లేలా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభాస్‌తో ప్రశాంత్ సినిమా అని వార్త బయటికి వస్తే జనాలకు నమ్మబుద్ధి కాలేదు. ఇది కూడా జస్ట్ హంగామా న్యూసే అనుకున్నారు. ప్రభాస్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో ప్రశాంత్‌తో ఎక్కడ సినిమా చేయగలడనే సందేహాలు కలిగాయి. ఓవైపు రాజాసాబ్, ఇంకోవైపు హను రాఘవపూడి సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. వీటికి తోడు సలార్-2, కల్కి-2 సినిమాలు చేయాల్సి ఉంది. అలాంటపుడు ప్రశాంత్‌తో సినిమా ఎలా అనే సందేహాలు కలిగాయి. కానీ ప్రశాంత్ సినిమా విషయంలో ప్రభాస్ చాలా సీరియస్‌గానే ఉన్నాడట. అతడిని స్క్రిప్టు అంతగా ఎగ్జైట్ చేసిందట.
ఇది ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్శ్‌లో భాగంగా తెరకెక్కబోయే సినిమా. కేవలం సినిమాకు ఓకే చెప్పడం మాత్రమే కాదు.. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఇటీవల లుక్ టెస్ట్‌కు కూడా హాజరైనట్లు సమాచారం. ప్రభాస్‌ను నెవర్ బిఫోర్ లుక్‌లో చూపించబోతున్నాడట ప్రశాంత్. రాజా సాబ్ పూర్తయ్యాక ఫౌజీ (వర్కింగ్ టైటిల్)తో పాటుగా దీని చిత్రీకరణలో పాల్గొనే అవకాశాన్ని ప్రభాస్ పరిశీలిస్తున్నాడట. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.