అమావాస్య ఎఫెక్ట్ : రాబిన్ హుడ్ VS మ్యాడ్ స్క్వేర్

ఈ నెలాఖరు మార్చి 29 విడుదల ప్లాన్ చేసుకున్న మ్యాడ్ స్క్వేర్ టీమ్ నిర్ణయం మార్చుకుని ఒక రోజు ముందు మార్చి 28 రావాలని ప్రకటించేసింది. ముందు చెప్పిన డేట్ అమావాస్య కావడం వల్ల డిస్ట్రిబ్యూటర్ల విన్నపాన్ని కాదనలేక ముందుకు జరిపామని నిర్మాత నాగవంశీ అనౌన్స్ చేశారు. అయితే నితిన్ రాబిన్ హుడ్ కూడా అదే తేదీకి వస్తున్నందున రెండూ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. నిజానికి ఒక రోజు గ్యాప్ ఉండటం వల్ల ఓపెనింగ్స్ పరంగా రెండింటికి ఉపయోగపడుతుందని బయ్యర్లు భావించారు. కానీ ఇప్పుడు అమావాస్య ఎఫెక్ట్ వల్ల క్లాష్ తప్పట్లేదు.

నిజానికి మార్చి 28 రావాల్సింది హరిహర వీరమల్లు. కానీ వాయిదా పడినట్టు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ జరుగుతున్న పరిణామాలన్నీ పోస్ట్ పోనే సూచిస్తున్నాయి. దానికి అనుగుణంగానే రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ లు ప్రమోషన్ల వేగం పెంచుతున్నాయి. అంచనాల పరంగా రెండూ ఆడియన్స్ లో ఆసక్తి రేపుతున్నవే. హిట్ కోసం కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ ఈసారి భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో చేయి కలిపాడు. శ్రీలీల కూడా తోడవ్వడంతో క్రమంగా హైప్ పెరుగుతోంది మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ వచ్చాక బజ్ తో పాటు బిజినెస్ ఎంక్వయిరీలు అమాంతం పెరిగాయని టాక్.

కాకతాళీయంగా సితార సంస్థ ప్లాన్ చేసుకుంటున్న రిలీజులన్నీ ఏదో ఒక రకంగా క్లాష్ ఎదురుకోక తప్పడం లేదు. గుంటూరు కారం టైంలో హనుమాన్ ప్రభావం చూపించింది. లక్కీ భాస్కర్ సూపర్ హిట్టే అయినా అమరన్ వల్ల వసూళ్లు కొంత తగ్గించుకోవాల్సి వచ్చింది. డాకు మహారాజ్ కు సంక్రాంతికి వస్తున్నాం వేసిన డెంట్ చిన్నది కాదు. ఈసారి మ్యాడ్ స్క్వేర్ కు రాబిన్ హుడ్ సవాల్ విసురుతోంది. పోటీ ఇక్కడితో అయిపోలేదు. మార్చి 27 మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వస్తోంది. తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో నెలాఖరులో ఎవరు విజేతలు అవుతారో వేచి చూడాలి మరి.