యూట్యూబ్ ఛానెళ్ల‌కు అనిల్ రావిపూడి వార్నింగ్

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తీసే సినిమాలు ఎంత స‌ర‌దాగా ఉంటాయో తెలిసిందే. ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా కూడా అంత స‌ర‌దానే ఉంటాడు. త‌న సినిమాలకు సంబంధించిన వేడుక‌ల్లో మాట్లాడేట‌పుడు.. ప్ర‌మోష‌న్ల‌లో కూడా అనిల్ ఎంట‌ర్టైన్మెంట్ అందిస్తూనే ఉంటాడు. అలాంటి వ్య‌క్తికి ఇప్పుడు కోపం వ‌చ్చింది. త‌న గురించి కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల‌లో చేస్తున్న ప్ర‌చారం ఆయ‌న ఆగ్ర‌హానికి కార‌ణం. చ‌క్క‌టి వాయిస్ ఓవ‌ర్‌లు జోడించి.. తన గురించి లేనిపోని స్టోరీలు అల్లేస్తున్నార‌ని.. ఆ వీడియోలు త‌న కుటుంబ స‌భ్యుల‌కు ఫార్వ‌ర్డ్ అవుతున్నాయ‌ని.. దీంతో వాళ్లు కంగారు ప‌డుతున్నార‌ని అనిల్ రావిపూడి ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

వెంట‌నే ఇలాంటి వీడియోలు తొల‌గించ‌క‌పోతే ఆ ఛానెళ్ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించాడు. ”నా గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లు క‌థ‌నాలు ఇస్తున్నారు.. అంద‌మైన వాయిస్ ఓవ‌ర్‌లు ఇచ్చి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఈ వీడియోలు చూసి మా బంధువులు, స‌న్నిహితులు.. వాటిని నా భార్య‌కు ఫార్వ‌ర్డ్ చేస్తున్నారు. అనిల్ గురించి ఇలా చెబుతున్నారేంటి అని అడుగుతున్నారు. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే నేను సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాను. ఇప్ప‌టికైనా మ‌ర్యాద‌గా ఆ వీడియోలు తీసేయండి. లేకుండా మిమ్మ‌ల్ని బ్లాక్ చేస్తారు. నా గురించి మాత్ర‌మే కాదు.. చాలామంది సెల‌బ్రెటీల గురించి ఇలాగే క‌థ‌లు అల్లేస్తున్నారు. క్లిక్స్ కోసం మంచి వాయిస్ ఓవ‌ర్‌ల‌తో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీని వ‌ల్ల చాలామంది ఇబ్బంది ప‌డుతున్నారు” అని అనిల్ అన్నాడు.

ఇక ద‌ర్శ‌కుడిగా త‌న ప‌దేళ్ల సినీ ప్ర‌యాణం గురించి అనిల్ మాట్లాడుతూ.. ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి 20 ఏళ్లు అవుతోంది. ర‌చ‌యిత‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టా. ఈ క్ర‌మంలో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డా. రైట‌ర్‌గా పేరొచ్చిన మూడేళ్ల‌కు క‌ళ్యాణ్ రామ్ గారు న‌న్ను న‌మ్మి ప‌టాస్ సినిమా చేసే అవ‌కాశ‌మిచ్చారు. ప్రేక్ష‌కుల అభిమానం వ‌ల్లే ద‌ర్శ‌కుడిగా ప‌దేళ్ల పాటు విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నా అని అనిల్ తెలిపాడు.