భీమ్స్ మిస్ కావడమే మైనస్సు

నిన్న విడుదలైన మజాకాకి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మరీ బ్యాడని అనడం లేదు కానీ ధమాకాని మించిన ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు పూర్తి సంతృప్తి కలగలేదు. పైగా ఓపెనింగ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదని ట్రేడ్ టాక్. వీక్ డే అయినప్పటికీ శివరాత్రి సెలవుదినం కావడంతో ఆడియన్స్ బాగా వస్తారని నిర్మాతలు అంచనా వేశారు. ప్రమోషన్ల ద్వారా సరిపడా బజ్ ఏర్పడనప్పటికీ ట్రైలర్ వల్ల హైప్ వచ్చిన మాట వాస్తవమే. అయితే మిక్స్డ్ టాక్ ప్రభావం కాసేపు పక్కనపెడితే ఒక్క అంశం మజాకాకు ప్రతికూలంగా పని చేసింది. అదే భీమ్స్ సిసిరోలియోను తీసుకోకపోవడం.

మాస్ మహారాజా రవితేజ ధమాకాకు భీమ్స్ ఇచ్చిన ఆల్బమ్ గొప్ప ఎనర్జీ ఇచ్చింది. మూడు పాటలు ఏకంగా రిపీట్ ఆడియన్స్ తీసుకొచ్చాయి. దండ కడియాల్, జింతాకు జిజిన, పల్సర్ బైకు ఒకదాన్ని మించి మరొకటి ఆడియో, వీడియో రెండింటి పరంగా ఓ రేంజ్ లో పేలాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ భీమ్స్ ఈ సినిమాకు బెస్ట్ ఇచ్చాడు. కానీ మజాకాలో ఇవి మిసయ్యాయి. ఏ పాటా ఛార్ట్ బస్టర్ కాలేదు. రావులమ్మా, పగిలి పగిలి కొంచెం సోషల్ మీడియాలో హడావిడి చేశాయి కానీ ఆశించిన స్థాయిలో కాదు. దానికి తోడు వీటి చిత్రీకరణ, కొరియోగ్రఫీ చెప్పుకునే స్థాయిలో లేకపోవడం ఇంప్రెషన్ తగ్గించేశాయి.

మజాకాకి భీమ్స్ ని రిపీట్ చేయకపోవడానికి దర్శకుడి వైపు కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ లియోన్ జేమ్స్ నుంచి కోరుకున్న అవుట్ ఫుట్ రాలేదన్నది వాస్తవం. మ్యూజిక్ అనేది ఒక సినిమా మీద ఆసక్తి రేగడానికి ఎంత పని చేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఛావాకు లాంటి బ్లాక్ బస్టర్ కు పని చేసిన ఏఆర్ రెహమాన్ మీదే కామెంట్స్ తప్పలేదు. అలాంటిది లియోన్ జేమ్స్ మినహాయింపుగా ఎలా ఉంటాడు. సుదీర్ఘమైన వీకెండ్ ఉంది కాబట్టి మజాకా ఈలోగా ఎంత రాబట్టుకుంటుందనేది కీలకం కానుంది. ముఖ్యంగా శని ఆదివారాలు నమోదయ్యే నెంబర్లు ఫైనల్ స్టేటస్ నిర్ణయిస్తాయి.