కెజిఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యష్ చేస్తున్న టాక్సిక్ షూటింగ్ పెద్దగా బ్రేకులు లేకుండా నిర్విరామంగా జరుగుతోంది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సమాంతరంగా రెండు వెర్షన్లు షూట్ చేయాలని నిర్ణయించుకుని దానికి అనుగుణంగానే చిత్రీకరణ జరుపుతున్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ రిస్క్ అనడానికి కారణాలున్నాయి. ఒకే కథను రెండు భాషల్లో ఒకేసారి తీస్తున్నప్పుడు నిర్మాణ పరంగా వ్యయం పెరుగుతోంది. గతంలో మహేష్ బాబు స్పైడర్, నాగార్జున శాంతి క్రాంతి లాంటివి ఇలా చేసే ప్రతికూల ఫలితాలు అందుకున్నాయి. ధనుష్ సార్ ఒకటే ఈ ట్రెండ్ కు ఎదురీది హిట్టు కొట్టింది.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే టాక్సిక్ ని ఇంగ్లీష్ లో తీయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటనేది ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్లు బాగుంటే యధాతథంగా అక్కడి ఆడియన్స్ చూస్తారని రాజమౌళి నిరూపించారు. జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ మన ఆర్ఆర్ఆర్ ని సబ్ టైటిల్స్ లో చూసే శభాష్ అని మెచ్చుకున్నారు. ఆస్కార్ అకాడమీ కూడా అదే చేసింది. అలాంటప్పుడు ప్రత్యేకంగా హాలీవుడ్ వెర్షన్ ని తీయడం వల్ల యాష్ ఆశిస్తున్నది ఏంటో అంతు చిక్కడం లేదు. ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్ అనుకున్నా దానికి డబ్బింగ్ చేసి మంచి రిలీజ్ దక్కేలా చూసుకుంటే చాలు కదా.
ఆ మధ్య యష్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన టీజర్ కు మిశ్రమ స్పందన దక్కింది. పెద్దగా ఏమి లేదంటూ విమర్శకులు పెదవి విరిచారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇప్పటిదాకా కమర్షియల్ హీరోని హ్యాండిల్ చేయలేదు. ఎన్నో అవార్డులు దక్కించుకున్న కంటెంట్లు ఇచ్చారు కానీ ఏం చెప్పి యష్ ని ఒప్పించారనేది పెద్ద పజిలే. కెజిఎఫ్ బ్రాండ్ ని నిలబెట్టుకునే క్రమంలో యష్ ఒత్తిడికి గురవుతున్నాడు. దానికేమాత్రం తగ్గని స్థాయిలో టాక్సిక్ రావాలని ముందు అనుకున్న విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న టాక్సిక్ లో నయనతార ఒక కీలక పాత్ర చేస్తోంది.