ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ మూవీగా దృశ్యం సినిమాను చెప్పొచ్చు. ఈ మలయాళ సినిమాను అనేక భాషల్లో రీమేక్ చేస్తే.. అన్ని చోట్లా విజయవంతం అయింది. హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా ఈ చిత్రాన్ని పునర్నిర్మించగా సూపర్ హిట్ అయింది. ఐతే దృశ్యం సీక్వెల్‌ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయగా.. ఇటు తెలుగులో విక్టరీ వెంకటేష్, అటు హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేశారు. వెంకీ మూవీ ఓటీటీలో రిలీజ్ కాగా.. అజయ్ సినిమా థియేటర్లలోనే రిలీజై సక్సెస్ అయింది. దానికి మంచి స్పందనే వచ్చింది.
ఐతే ఇప్పుడు మోహన్ లాల్ దృశ్యం-3 సినిమాకు రెడీ అవుతున్నాడు. దర్శకుడు జీతు జోసెఫ్ ఇటీవలే స్క్రిప్టు కూడా రెడీ చేశాడు. త్వరలోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఐతే మలయాళ వెర్షన్ పట్టాలెక్కబోతుండగానే.. వేరుగా హిందీలో దృశ్యం-3 చేయడానికి రెడీ అవుతుండడం విశేషం. తన చేతుల్లో ఉన్న వేరే సినిమాలను పక్కన పెట్టి మరీ అజయ్ దేవగణ్ దృశ్యం-3 చేయడానికి సిద్ధమవుతున్నాడట. హిందీలో దృశ్యం, దృశ్యం-2 చిత్రాలను రూపొందించిన అభిషేక్ పాఠక్.. సొంతంగా దృశ్యం-3 స్క్రిప్టు రెడీ చేశాడట. మంచి ట్విస్ట్‌లు, టర్న్‌లతో అతడి స్క్రిప్టు తయారైందట.
అది చూసి ఇంప్రెస్ అయిన అజయ్ దేవగణ్.. మరోవైపు మలయాళంలో దృశ్యం-3 కూడా పట్టాలెక్కుతున్న నేపథ్యంలో అదే సమయంలో హిందీలో వేరుగా దృశ్యం-3 చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దృశ్యం, దృశ్యం-2 చిత్రాలకు జీతు స్క్రిప్టు మీదే ఆధారపడ్డ అజయ్-అభిషేక్.. ఇప్పుడు సొంత కథతో ముందుకు వెళ్తుండడం విశేషమే.
ఐతే జీతులా వీళ్లు పక్డబందీ థ్రిల్లర్ తీయగలరా అన్నది సందేహం. దృశ్యంకు ఏమాత్రం తగ్గని రీతిలో దృశ్యం-2 తీసి వావ్ అనిపించాడు జీతు. ఇప్పుడు దృశ్యం-3 కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుందనే అంచనాలున్నాయి. మలయాళ దృశ్యం-3 ఈ ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. మరి హిందీ వెర్షన్ ఎప్పుడు రెడీ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates