హీరోల కొడుకులు హీరోలైపోవడం ఈజీనే. కానీ సంగీత దర్శకుల తనయులు తండ్రి వారసత్వాన్ని అందుకోవడం అంత సులువు కాదు. లుక్స్, నటన ఎలా ఉన్నప్పటికీ హీరోలైపోవచ్చు. డబ్బులుంటే నాలుగు సినిమాలు చేసేయొచ్చు. కానీ సంగీత వారసత్వాన్ని కొనసాగించడం మాత్రం సవాలుతో కూడుకున్న విషయమే. సంగీత దర్శకుల తనయులు తండ్రి వారసత్వాన్ని అందుకోవడం, విజయవంతం కావడం అరుదుగానే జరుగుతుంటుంది.
తెలుగులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు తనయుడు కోటి.. తమిళంలో ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా.. ఇలా చాలా కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ కూడా తండ్రి వారసత్వాన్ని అందుకున్నాడు కానీ.. అతనింకా ఓ మోస్తరు స్థాయిలోనే ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అని మాత్రం అనిపించుకోలేదు.
ఐతే ఈ కోవలో కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కీరవాణి తనయుడు కాలభైరవ మాత్రం చాలా త్వరగానే మంచి పేరు సంపాదించేశాడు. సంగీత దర్శకుడిగా అతడి అరంగేట్ర సినిమా ‘మత్తు వదలరా’తోనే తనదైన ముద్ర వేశాడు. ఐతే అది థ్రిల్లర్ సినిమా. సంగీతానికి మరీ ఎక్కువ ప్రాధాన్యమేమీ లేదు. ఐతే ఇప్పుడు కొత్తగా రిలీజైన ‘కలర్ ఫోటో’ మాత్రం పూర్తిగా సంగీతం మీద ఆధారపడ్డ సినిమా. ఈ చిత్రంతో కాలభైరవ తన సత్తా ఎలాంటిదో చూపించాడు. ఒకవైపు పాటలు, మరోవైపు నేపథ్య సంగీతంతో సినిమాకు పెద్ద బలంగా నిలిచాడు. తరగతి గది, అరెరే ఆకాశం పాటలు సినిమా విడుదలకు ముందే పాపులర్ అయ్యాయి. సినిమాలో అవి మరింతగా ఎలివేట్ అయ్యాయి.
ఇక నేపథ్య సంగీతం అయితే ఆద్యంతం ఒక ఫీల్‌తో సాగి ప్రేక్షకుల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేసింది. మామూలుగా అనిపించిన సన్నివేశాల్ని సైతం బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఎలివేట్ చేశాడు కాలభైరవ. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కాలభైరవ సంగీతం మాత్రం టాప్ క్లాస్ అనిపించింది. నేపథ్య సంగీతం ద్వారా కూడా తన శైలిలో ఈ కథను చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాడు కాలభైరవ.
నిన్న ‘కలర్ ఫోటో’ సినిమా రిలీజైనప్పటి నుంచి ఏకగ్రీవంగా సినిమాకు పెద్ద ప్లస్ అని చెబుతున్నది కాలభైరవ సంగీతం గురించే. అతను కచ్చితంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడన్న భరోసాను ఈ సినిమా ఇచ్చింది. ఇకపై కాలభైరవ గురించి చెప్పేపుడల్లా కీరవాణి కొడుకుగా పరిచయం చేయాల్సిన అవసరమైతే లేదన్నది స్పష్టం.
Gulte Telugu Telugu Political and Movie News Updates