మోక్షజ్ఞ ఎంట్రీ… ఇప్పట్లో ఉండదా?

టాలీవుడ్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అరంగేట్రం అంటే.. నందమూరి మోక్షజ్ఞదే. నిన్నటితరం సూపర్ స్టార్లలో చిరంజీవి, నాగార్జునల వారసులు ఎప్పుడో సినిమాల్లోకి వచ్చారు కానీ.. నందమూరి బాలకృష్ణ కొడుకు అరంగేట్రం మాత్రం అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అయింది. ఎప్పుడో ఏడెనిమిదేళ్ల కిందటే అనుకున్న ఎంట్రీ.. 2025లో కూడా సాధ్యపడేలా లేదు. గత ఏడాది మోక్షజ్ఞ తొలి చిత్రం గురించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది, అతడి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. కానీ ముహూర్త కార్యమ్రానికి అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాలతో ఆ వేడుక వాయిదా పడింది.

ఇక అప్పట్నుంచి మోక్షజ్ఞ తొలి చిత్రంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సిన ప్రశాంత్ వర్మ ఏడాదికి పైగా వేరే సినిమా చేయకుండా ఉండిపోయాడు. ఇటు మోక్షజ్ఞ సినిమా మొదలు పెట్టలేక, అటు వేరే సినిమానూ పట్టాలెక్కించలేక ప్రశాంత్ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. ప్రశాంత్ ‘జై హనుమాన్’ను సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నాడట. మోక్షజ్ఞ రెడీ అన్నపుడు అందుబాటులోకి వస్తానని బాలయ్యకు చెప్పి, ఆయన అనుమతితోనే ఆ ప్రాజెక్టును ప్రశాంత్ టేకప్ చేస్తున్నాడట.

మోక్షజ్ఞ ఇప్పుడిప్పుడే రెడీ అనే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి 2025లో మోక్షజ్ఞ అరంగేట్రం ఉండదన్నది స్పష్టం. కాబట్టి నందమూరి అభిమానుల నిరీక్షణ మరి కొంత కాలం కొనసాగబోతున్నట్లే. ఇటీవల బాలయ్య పద్మభూషణ్ అయిన సందర్భంగా నిర్వహించిన అభినందన వేడుకలో మోక్షజ్ఞ చక్కటి లుక్‌లో కనిపించి అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచాడు. దీంతో త్వరలోన సినిమా మొదలైపోతుందని అనుకున్నారు. కానీ కారణాలేంటన్నది తెలియట్లేదు కానీ.. అతడి అరంగేట్రం అయితే వెనక్కి వెనక్కి వెళ్తూనే ఉంది.