తండేల్ గెలిచింది నిజమే కానీ…

నాగ చైతన్య కెరీర్లో బిగ్ బడ్జెట్ మూవీగా విడుదలకు ముందే వంద కోట్లు సాధిస్తుందని గర్వంగా చెప్పుకున్న తండేల్ ఆ ఫీట్ అయితే పూర్తి చేసింది కానీ అభిమానులు కోరుకున్నంత పెద్ద స్థాయిలోనా అంటే కాదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే వీకెండ్స్ మినహాయించి రెండో వారంలోనే తండేల్ స్లో అయిపోయింది. పాజిటివ్ టాక్ వచ్చిన నిజమే కానీ సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ కాకపోయినా డాకు మహారాజ్ లా కనీసం నూటా యాభై కోట్ల గ్రాస్ అయినా దాటి ఉండాల్సిందని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. ఇంకా ఫైనల్ రన్ కాలేదు కానీ వసూళ్ల గ్రాఫ్ తగ్గిపోవడం చూస్తే ఆ మైలురాయి కష్టమే అనిపిస్తోంది.

టీమ్ సైతం ప్రమోషన్లను నెమ్మదించేసింది. దర్శకుడు చందూ మొండేటి అడపాదడపా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తప్పించి చైతు సైలెంట్ అయిపోగా సాయిపల్లవి వేరే షూటింగ్స్ కు వెళ్ళిపోయింది. వరుసగా సక్సెస్ ఈవెంట్లు, టూర్లు చేసొచ్చాక నిర్మాతలు బన్నీ వాస్, అల్లు అరవింద్ రిలాక్స్ అయ్యారు. ప్రాక్టికల్ గా చూస్తే అంతా సవ్యంగానే జరిగిపోయినట్టే. ఎందుకంటే తండేల్ థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఓటిటి, శాటిలైట్, ఆడియో డబ్బింగ్ అన్నీ కలుపుకుని టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఇకపై వసూళ్లు వచ్చినా రాకపోయినా తండేల్ కు వచ్చిన నష్టమేమి లేదని చెప్పొచ్చు.

కాకపోతే ఇంకొక్క ఛాన్స్ ఉంది. మరో వీకెండ్ స్లాట్ ఖాళీగా ఉంది. కొత్తగా రిలీజైన వాటిలో బాపు, రామం రాఘవం ఎమోషన్స్ బరువులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడేలా ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలు జాబిలమ్మా నీకు అంత కోపమా, రిటర్న్ అఫ్ ది డ్రాగన్ కు యూత్ మద్దతు సోషల్ మీడియాలో కనిపిస్తోంది కానీ ప్రేమలు స్థాయిలో ఇవి మేజిక్ చేస్తాయా లేదనేది వీకెండ్ అయ్యాక క్లారిటీ వస్తుంది. సో తండేల్ కనక మళ్ళీ పికప్ అయితే శని ఆదివారాలు క్యాష్ చేసుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ తో నాలుగు వారాల విండో ఒప్పందం కనక నిజమైతే మార్చి రెండో వారంలో తండేల్ డిజిటల్ ప్రీమియర్ చూడొచ్చు.