వెంకీ సార్… దృశ్యం 3 వదలొద్దు

నిన్న మోహన్ లాల్ దృశ్యం 3ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో అతి త్వరలో ప్రారంభం కానుందని చెప్పేశారు. ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని పరిచయం చేసి బ్లాక్ బస్టర్స్ సాధించిన ఈ జంట మూడో భాగంలో మరిన్ని మతిపోగొట్టే ట్విస్టులతో స్క్రిప్ట్ సిద్ధం చేసిందని సమాచారం. దృశ్యం ఫ్రాంచైజ్ ని హిందీలో అజయ్ దేవగన్, తెలుగులో వెంకటేష్ చేసిన సంగతి తెలిసిందే. అయితే థర్డ్ పార్ట్ విషయంలో వెంకీ ఆలస్యం చేయకుండా సమాంతరంగానో లేదా మలయాళం వెర్షన్ కాగానే ఏది ముందైతే అది దృశ్యం 3 రీమేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత కథల ఎంపికలో వెంకటేష్ జాగ్రత్త పడుతున్నారు. తొందపడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ ఓకే చెప్పిన ఇద్దరు దర్శకులను పెండింగ్ లో ఉంచారు. మళ్లోసారి కొన్ని మార్పులు చేసుకొచ్చి ఫైనల్ నెరేషన్ ఇమ్మని చెప్పారట. తెలుగు దృశ్యం 2కి దర్శకత్వం వహించింది జీతూ జోసేఫే. కానీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కావడంతో దాని స్థాయి ఏంటనేది పూర్తిగా బయటికి రాలేదు. చూసిన ఆడియన్స్ ఫస్ట్ పార్ట్ కి ఏ మాత్రం తగ్గకుండా మెప్పించిందని ప్రశంసలు కురిపించారు. సో దృశ్యం 3 టాలీవుడ్ లోనూ కొనసాగితే మంచి బజ్ రావడం ఖాయం.

నదియా కొడుకు చనిపోయాక కూడా అతని శవం ఎక్కడుందో జాడ చెప్పకుండా ఇప్పటిదాకా ఆడుకున్న దృశ్యం హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరం. క్యాస్టింగ్ ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. హీరో వేరే అయినా సరే వీలైతే దృశ్యం 3ని మలయాళం, తెలుగు ఒకేసారి షూట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలా సాధ్యమా అనుకోవద్దు. గతంలో సింహాసనం (కృష్ణ -జితేంద్ర), శాంతి క్రాంతి (నాగార్జున- రవిచంద్రన్) లాంటివి దాన్ని చేసి చూపించారయి. సో దృశ్యం 3ని అలాగే తీస్తే బాగుంటుంది కానీ మాటల్లో చెప్పినంత సులభం కాదు. ఇదేమో కానీ వెంకీ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే నెల రావొచ్చు.