ట్రెండ్ వెంట పడలేదు – సందీప్ కిషన్

కెరీర్ మొదలుపెట్టి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందీప్ కిషన్ కొత్త సినిమా మజాకా వచ్చే వారం ఫిబ్రవరి 26 విడుదల కానుంది. కొంచెం గ్యాప్ తర్వాత చేసిన కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో దీని మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. అందులోనూ రవితేజకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక దర్శకుడు త్రినాథరావు నక్కిన టేకప్ చేసిన ప్రాజెక్టు ఇదే. ఇంతే కాదు సామజవరగమన నిర్మాతలు అనిల్ సుంకర – రాజేష్ దండా కలయిక, హీరోయిన్ రీతూ వర్మ మాస్ టచ్, లియోన్ జేమ్స్ సంగీతం ఇలా ఆకర్షణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ కొన్ని ముఖ్యమైన విషయాలు మా సైట్ తో పంచుకున్నాడు.

ఎంబిఏ చేసిన సందీప్ కిషన్ కు స్వతహాగా కేస్ స్టడీలు చేయడమంటే ఇష్టం. ఒక కంపెనీ ఎత్తుపల్లాలు, లాభ నష్టాలు వీటి గురించి చదువుకుని విశ్లేషణ చేయడం అలవాటు. అదే తరహాలో హీరోలను స్టడీ చేశాడు. వాళ్ళతో పాటు తనను తాను అనాలిసిస్ చేసుకుని చూస్తే సందీప్ గర్వంగా ఫీలవుతున్నాడు. ఎందుకంటే ఏదో బ్లాక్ బస్టర్ ట్రెండ్ మొదలైందనో, లేదా పెద్ద బ్యానర్ హిట్ కొట్టిందనో, టాప్ డైరెక్టర్ వెంట పడదామనో ఎప్పుడూ ప్రయత్నించలేదు. మధ్యలో హెచ్చుతగ్గులు వచ్చినప్పటికీ తిరిగి కోలుకుని సంతృప్తికరంగా కెరీర్ నడపడంలో వంద శాతం విజయవంతం కావడం పట్ల గర్వంగా ఉన్నాడు.

ఇదంతా స్వయంగా తనే చెప్పుకున్న విషయాలు. గత ఏడాది ఊరిపేరు భైరవకోన, రాయన్ హిట్టయ్యాక మజాకాని ఎంచుకున్నాడు. ట్రైలర్ చూస్తుంటే పూర్తి వినోదాత్మకంగా రూపొందినట్టు అర్థమవుతోంది. మన్మథుడు ఫేమ్ అన్షు దీంతోనే రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. కోలీవుడ్ స్టార్ హీరో జేసన్ సంజయ్ డైరెక్షన్ డెబ్యూలో సందీప్ కిషనే హీరో. నెట్ ఫ్లిక్స్ మొదటి డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్ కథానాయకుడిగా తననే ఎంచుకుంది. ఇప్పుడీ మజాకా మరో బ్రేక్ అవుతుందనే కాన్ఫిడెన్స్ సందీప్ కిషన్ లో కనిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలిలో తలైవాతో స్క్రీన్ పంచుకోవడం తన ఖాతాలో మరో మైలురాయి కానుంది.