దృశ్యం-3… గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు!

ఒక భారతీయ చిత్రం.. దాదాపు పది భాషల్లో రీమేక్ కావడం, అందులో సింహళీస్ (శ్రీలంక), చైనీస్ భాషలు కూడా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. మలయాళ చిత్రం ‘దృశ్యం’ ఈ ఘనతే సాధించింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల లిస్టు తీస్తే.. అందులో ‘దృశ్యం’ అగ్ర భాగాన ఉంటుందనడంలో సందేహం లేదు. భాషా భేదం లేకుండా అందరూ ఈ కథను ఆదరించారు. మలయాళంలో బ్లాక్‌ బస్టర్ అయ్యాక తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే అన్ని చోట్లా ఘనవిజయం సాధించింది. చైనీస్, సింహళీస్ లాంటి విదేశీ భాషల్లో సైతం ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితాన్ని అందుకోవడం విశేషం.

‘దృశ్యం’కు కొనసాగింపుగా మోహన్ లాల్-జీతు జోసెఫ్ జోడీ ‘దృశ్యం-2’ తీస్తే అది కూడా అద్భుత స్పందన తెచ్చుకుంది. కరోనా టైంలో నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దీనికి కొనసాగింపుగా ‘దృశ్యం-3’ కూడా ఉంటుందనే సంగతి ముందే ఖరారైంది. ఇప్పుడీ చిత్రం గురించి హీరో మోహన్ లాల్ ఇంకో అప్‌డేట్ ఇచ్చాడు. ‘దృశ్యం-3’ అతి త్వరలోనే మొదలు కాబోతున్న విషయాన్ని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా ఖరారు చేశారు. దర్శకుడు జీతు జోసెఫ్, నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్‌లతో కలిసి ఉన్న ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్న ఒక కామెంట్ కూడా జోడించారు.

‘‘గతం ఎప్పడూ నిశ్శబ్దంగా ఉండదు. దృశ్యం-3 రాబోతోంది’’ అని మోహన్ లాల్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి జీతు స్క్రిప్టు పూర్తి చేశాడని.. కొన్ని వారాల్లోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోందని సమాచారం. ఈసారి కొవిడ్ లాంటి అడ్డంకులేమీ లేకపోవడంతో ‘దృశ్యం-3’ పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతోంది. ఇప్పుడే సినిమా అనౌన్స్ చేశారు కదా అని ఏళ్ల పాటు సినిమా కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. మలయాళంలో ఎలాంటి చిత్రాన్నయినా కొన్ని నెలల్లోనే ముగించేస్తారు. జీతు కూడా సినిమాలు తీయడంలో సూపర్ ఫాస్ట్. కాబట్టి ఈ ఏడాది చివరిలోపే ‘దృశ్యం-3’ ప్రేక్షకులను పలకరిస్తే ఆశ్చర్యమేమీ లేదు.

ఇక ఈ దృశ్యం సినిమాకి మన తెలుగు లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. వెంకటేష్ రీమేక్ చేసిన ఈ సినిమా రెండు భాగాలు తెలుగు ప్రేక్షకులని ఎంతగా అలరించాయో చెప్పనవసరం లేదు. ఇక పార్టీ 3 రీమేక్ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.