సంక్రాంతి పండక్కు విడుదలై ఘనవిజయం సాధించిన డాకు మహారాజ్ రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే కొద్దిరోజుల క్రితం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చిన పోస్టర్ లో ఊర్వశి రౌతేలాని తీసేయడం పట్ల ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చే జరిగింది. ఆమె ఉన్న సీన్లు ఓటిటిలో తీసేశారని ముంబై వర్గాల్లో కథనాలు కూడా వచ్చాయి. ఇదంతా గమనించిన సదరు సంస్థ తర్వాత ఊర్వశి ఫోటోలతో సెపరేట్ గా ప్రమోషన్ చేసింది కానీ అభిమానుల్లో మాత్రం అనుమానం అలాగే ఉండిపోయింది. దబిడి దిబిడి పాట ఉండొచ్చేమో కానీ కొన్ని సన్నివేశాలు ఒకవేళ కోతకు గురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇలా ఎందుకనే కారణాలు స్పష్టంగా తెలియలేదు కానీ సైఫ్ అలీ ఖాన్ ఉదంతం జరిగినప్పుడు ఊర్వశి రౌతేలా సందర్భం లేకుండా ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకుని ట్రోలింగ్ గురైన సంగతి విదితమే. అంతకు ముందు సోషల్ మీడియా ట్రోల్స్ ని ప్రశంసలుగా భ్రమపడి వాటిని స్టేటస్ గా పెట్టుకుని మరింత నవ్వుకోవడానికి అవకాశం ఇచ్చింది. పైగా ఇవన్నీ చాలవన్నట్టు 2025 తొలి వంద కోట్ల సినిమా హీరోయిన్ నేనే అన్నట్టుగా చెప్పుకోవడం మరింత ఆజ్యం పోసింది. అసలు హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ఇంత హడావిడి చేయనే లేదు. నిజానికి డాకు మహారాజ్ లో ఊర్వశి పాత్రకు ప్రాధాన్యం చాలా తక్కువ.
మొత్తానికి ఓటిటి రిలీజ్ ముంగిట ఇంటరెస్టింగ్ టాపిక్ అయితే కనిపిస్తోంది. టాలీవుడ్ క్రేజీ సినిమాలను సొంతం చేసుకుంటున్న నెట్ ఫ్లిక్స్ లక్కీ భాస్కర్, పుష్ప 2 ది రూల్ తర్వాత డాకు మహారాజ్ తో ప్రపంచ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. హిందీ డబ్బింగ్ వెర్షన్ సైతం తెలుగు, తమిళ, మలయాళంతో పాటు ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ యాక్షన్ మూవీకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీని కోసమే రిపీట్స్ చూసిన ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే నెట్ ఫ్లిక్స్ లో వస్తున్న మొదటి బాలకృష్ణ భారీ సినిమా ఇదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates