సెన్సేషన్ : ‘హాలీవుడ్ రిపోర్టర్’ పత్రికపై అల్లు అర్జున్

పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేయడం దగ్గరే దీని సంచలనాలు ఆగిపోలేదు. క్రికెట్ మ్యాచుల్లో విజేతలు మ్యానరిజం అనుకరించడం, ఇన్స్ టా రీల్స్ లో పాటలను ఇమిటేట్ చేయడం, బాలీవుడ్ జనాలు వెర్రెక్కిపోయి పుష్ప వేషధారణలో హల్చల్ చేయడం చాలానే చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మేగజైన్ దాకా అల్లు అర్జున్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు మరో ఉదాహరణ తోడయ్యింది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియన్ ఎడిషన్ తొలి పత్రిక ముఖ చిత్రంగా బన్నీ ఫోటోనే ప్రచురించడం ఖచ్చితంగా హిందీ స్టార్లకు మింగుడు పడని వ్యవహారమే.

అంతే స్పెషల్ ఏముందో చూద్దాం. ది హాలీవుడ్ రిపోర్టర్ 1930 నుంచి డైలీ ట్రేడ్ పేపర్ గా విదేశాల్లో పేరుగాంచింది. 2010 నుంచి ప్రింట్ వెర్షన్ మొదలుపెట్టింది. 94 సంవత్సరాల క్రితం తొలి సంచిక వెలువడింది. అప్పటి నుంచి మీడియాలో తనదైన ముద్ర వేస్తూ కోట్లాది చదువరుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. దీనికి ఆన్ లైన్ వెబ్ సైట్ కూడా ఉంది. ఇంత చరిత్ర కలిగిన ది హాలీవుడ్ రిపోర్టర్ మన దేశంలో అడుగు పెట్టింది. ఖరీదు మన వీక్లీ మ్యాగజైన్ లాగా అరవై డెబ్బై రూపాయలు కాదండోయ్. ఏకంగా 200 రూపాయలు వెచ్చిస్తే తప్ప దీన్ని కొనలేరు. సెన్సేషన్ జర్నలిజంలో హాలీవుడ్ రిపోర్టర్ కు బాగా పేరుంది.

అయితే మన సినిమాలు, ఎంటర్ టైన్మెంట్ కు సంబంధించిన సమాచారం, కథనాలు మాత్రమే ఇండియన్ ప్రింట్ – వెబ్ ఎడిషన్ లో ఉంటాయి. మన దేశంలో ఇందరు స్టార్లు ఉండగా అల్లు అర్జున్ నే లాంచ్ ఇష్యూకి తీసుకోవడం మాములు విషయం కాదు. పుష్ప 2 ఎఫెక్ట్ ఎంత దూరం వెళ్లిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. థియేటర్ రన్ పూర్తి చేసుకుని నెట్ ఫ్లిక్స్ లోనూ భారీ వ్యూస్ రాబడుతున్న పుష్ప 2 ఇదంతా చూసి మూడో భాగానికి నాంది పలుకక తప్పేలా లేదు. ప్రస్తుతానికి బన్నీ, సుకుమార్ వేర్వేరు కమిట్ మెంట్లతో బిజీ ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఓ రెండు మూడు సంవత్సరాల తర్వాతైనా పుష్ప 3 ది ర్యాంపేజ్ ని తీసుకురావాలి.