బెంగళూరులోని వినియోగదారుల కోర్టు సినిమా ప్రదర్శనలో ప్రకటనల వ్యవహారంపై కీలక తీర్పు ఇచ్చింది. 2024లో విడుదలైన సామ్ బహదూర్ సినిమా ప్రదర్శనకు ముందుగా, సుమారు 25 నిమిషాల పాటు ప్రసారమైన కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్స్ తన సమయాన్ని వృథా చేశాయని అభిషేక్ ఎం.ఆర్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సినిమా ముగిసిన వెంటనే తన పనులకు వెళ్లాల్సి ఉండడంతో ఈ ఆలస్యం తీవ్ర అసౌకర్యం కలిగించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో కోర్టు పీవీఆర్ సినిమాస్ షో పట్ల తప్పుబట్టింది. సినిమా అసలు ప్రారంభ సమయాన్ని టికెట్లపై స్పష్టంగా చూపించాలని ఆదేశించింది. బుక్ మై షోకు ఈ వ్యవహారంలో ఎటువంటి బాధ్యత లేదని కోర్టు పేర్కొన్నప్పటికీ, థియేటర్లు మాత్రం ప్రేక్షకుల సమయాన్ని వ్యర్థం చేయడం న్యాయసమ్మతం కాదని తేల్చింది.
తమ థియేటర్లలో ఆలస్యంగా వచ్చే ప్రేక్షకులకు అనుగుణంగా ప్రకటనల సమయాన్ని పెంచుతున్నామని పీవీఆర్, ఐనాక్స్ కోర్టులో వాదించాయి. అయితే, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సమయానికి వచ్చిన ప్రేక్షకులను 25-30 నిమిషాలు ప్రకటనలు చూడమని అనడం అన్యాయమని పేర్కొంది. సినిమా టికెట్‌లో ప్రకటనలకు వెచ్చించే సమయాన్ని కాకుండా, నిజమైన షో టైమ్‌ను చూపించాలనే తీర్పును ఇచ్చింది.
ఈ తీర్పులో భాగంగా, పీవీఆర్, ఐనాక్స్‌లను అభిషేక్ ఎం.ఆర్‌కు ₹20,000 నష్టపరిహారం, కేసు ఖర్చుల కోసం ₹8,000 చెల్లించాలని ఆదేశించింది. అదనంగా, రూ.1 లక్షను శిక్షార్హమైన నష్టపరిహారంగా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు తర్వాత థియేటర్లలో ప్రకటనల వ్యవస్థపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణలు అమలవుతాయని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates