తెలుగు సినిమాలకు అనే కాదు.. మొత్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కాసుల వర్షం కురిపించే లాంగ్ సీజన్ అంటే.. వేసవినే. సినిమాలకు మహరాజ పోషకులైన యూత్ అంతా ఆ టైంలో పరీక్షలు పూర్తి చేసుకుని ఖాళీగా ఉంటారు. సెలవుల్లో సినిమాలు ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఏసీ థియేటర్లలో కూర్చుని సినిమాలు ఆస్వాదించాలని చూస్తారు. అందుకే వేసవిలో పెద్ద పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ప్రతి వారం క్రేజీ మూవీ రిలీజవుతుంటుంది.
కానీ ఈ మధ్య వేసవి సినిమాల విషయంలో టాలీవుడ్ ప్లానింగ్ సరిగా ఉండట్లేదు. కొవిడ్ దగ్గర్నుంచి ప్రణాళికలన్నీ దెబ్బ తింటున్నాయి. గత వేసవిలో ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా లేకపోయింది. ఈ ఏడాది కూడా పరిస్థితి భిన్నంగా ఉండేలా లేదు. రాజా సాబ్, విశ్వంభర.. ఇలా ఒక్కొక్కటిగా పెద్ద సినిమాలు వేసవి రేసు నుంచి తప్పుకుంటున్నాయి. వేసవికి షెడ్యూల్ చేసిన ఈ చిత్రాలు వాయిదా పడడం అనివార్యం. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. ఇవి సమ్మర్లో రావన్నది మాత్రం స్పష్టం.
పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ కూడా వాయిదా పడడం పక్కా అని అంటున్నారు. ‘కన్నప్ప’ మినహాయిస్తే ఒక స్థాయి ఉన్న సినిమాలేవీ సమ్మర్లో రిలీజ్ కావట్లేదు. ఇప్పుడు వేసవి మరింత కళ తప్పే అప్‌డేట్ ఒకటి బయటికి వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘కూలీ’తో అయినా సర్దుకుపోదాం అంటే ఇప్పుడు దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజినీ సినిమా అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది.
పైగా ఇందులో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. తెలుగు నుంచి పెద్ద సినిమాలు లేకపోయినా.. ‘కూలీ’ కొంతమేర లోటు తీరుస్తుందని అనుకుంటే.. దాన్ని ఆగస్టుకు వాయిదా వేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీంతో 2025 వేసవి మీద ప్రేక్షకులు మరింతగా ఆశలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.