ప్రస్తుతం సౌత్ లోనే కాదు బాలీవుడ్ లోనూ అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొస్తున్న పేరు రష్మిక మందన్న. ఒకటి రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో శ్రీవల్లి దూసుకుపోతున్న తీరు మాములుగా లేదు. యానిమల్ రన్బీర్ కపూర్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి రికార్డుల దుమ్ము దులిపింది. పుష్ప 2 ది రూల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రెండు వేల కోట్లకు పైగా వసూళ్లతో ఔరా అనిపించింది. తాజాగా చావా ఉత్తరాదిలో సృష్టిస్తున్న సునామికి థియేటర్లు షేక్ అవుతున్నాయి. విక్కీ కౌశల్ కు కలగా నిలిచిన మొదటి వీకెండ్ హండ్రెడ్ క్రోర్ మార్క్ మంచి నీళ్లు తాగినంత సులభంగా వచ్చేసింది.
ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న రష్మిక మందన్న సినిమా సికందర్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. రంజాన్ పండక్కు విడుదల చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎంతవరకు సాధ్యమవుతుందో అనే దాని మీద ట్రేడ్ వర్గాల్లో అనుమానాలు నెలకొన్నాయి. విఎఫ్ఎక్స్ పనులు చాలా పెండింగ్ ఉన్నాయట. ప్రస్తుతం కండల వీరుడి మార్కెట్ డౌన్ లో ఉంది. టైగర్ 3 యావరేజ్ కు ఒక మెట్టు పైన నిలవగా కిసీకా భాయ్ కిసీకా జాన్ సోషల్ మీడియాకు ట్రోలింగ్ మెటీరియలయ్యేంత డిజాస్టర్ కొట్టింది.
క్యామియోలు చేసిన బేబీ జాన్, వేద్, అంతిమ్, గాడ్ ఫాదర్ అన్నీ అంతంత మాత్రమే. కరోనా టైంలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్న రాధే అయితే మరీ దారుణం. సింగం అగైన్ ఒక్కటే కొంత పర్వాలేదు కానీ అందులో కనిపించేది కేవలం కొన్ని సెకండ్లే. ఇంత బ్యాడ్ ట్రాక్ రికార్డు మధ్య సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ కొట్టాలి. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ సికందర్ మీదే ఉన్నాయి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మాస్ సినిమాకు రష్మిక మందన్న సెంటిమెంట్ అచ్చి రావాలనేది ఫ్యాన్స్ కోరిక. ఎలాగూ తన జోరు కూడా అలాగే ఉంది కాబట్టి ఒకవేళ నిజంగా ఇదే జరిగితే మాత్రం రష్మిక డిమాండ్ మరింత ఎగబాకడంలో అనుమానం లేదు.