తెలుగు ద‌ర్శ‌కుడికి బాలీవుడ్లో మ‌రో ఛాన్స్

పిల్ల జ‌మీందార్ లాంటి హిట్ సినిమాతో తెలుగు తెర‌కు పరిచ‌యం అయ్యాడు యువ ద‌ర్శ‌కుడు అశోక్‌. ఐతే ఓ కొరియ‌న్ మూవీని కాపీ కొట్టి తీసిన ఆ సినిమా త‌ర్వాత అత‌ను అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడు. సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా అత‌ను తీసిన రెండో సినిమా సుకుమారుడు డిజాస్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కించిన చిత్రాంగ‌ద ప్రేక్ష‌కుల‌ను చిత్ర‌వ‌ధ‌కు గురి చేసింది.

ఐతే ఈ సినిమా చేస్తుండ‌గానే యువి క్రియేష‌న్స్ లాంటి పెద్ద బేన‌ర్లో అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో ఓ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ చేసే అవ‌కాశం ద‌క్కింది అశోక్‌. ఆ సినిమానే.. భాగ‌మ‌తి. అశోక్ ఫామ్‌ చూసి ఈ సినిమా ఏమాత్రం వ‌ర్క‌వుట‌వుతుందో అని అంతా సందేహించారు.

కానీ భాగ‌మ‌తి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. పెద్ద హిట్ట‌యింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే అవ‌కాశం కూడా అశోక్‌నే వ‌రించింది. భూమి ప‌డ్నేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో దుర్గావ‌తి పేరుతో అక్క‌డీ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు అశోక్. హీరో అక్ష‌య్ కుమార్, అగ్ర నిర్మాత భూష‌ణ్ కుమార్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించ‌డం విశేషం. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబ‌రు 11న‌ అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కాబోతోంది.

ఈ సినిమా చేస్తుండ‌గానే అశోక్ బాలీవుడ్లో మ‌రో అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం విశేషం. ఉఫ్ పేరుతో అత‌ను అక్క‌డ ప్ర‌యోగాత్మ‌కంగా సైలెంట్ మూవీ చేయ‌బోతున్నాడు. నుష్ర‌త్ బ‌రూచా, నోరా ఫ‌తేహి, సోహ‌మ్ షా ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ల‌వ్ రంజ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుండ‌టం విశేషం.