గత ఏడాది టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ పెద్ద వ్యక్తిగత వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి అతడి మీద తీవ్ర ఆరోపణలే చేసింది. తనతో కొన్నేళ్ల పాటు సహజీవనం చేయడంతో పాటు పెళ్లి కూడా చేసుకున్న రాజ్.. తర్వాత తనను మోసం చేసి మాల్వి మల్హోత్రా అనే కథానాయికతో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాడంటూ ఆమె ఆరోపించింది. అతడి మీద కేసులు కూడా పెట్టింది.
కొన్ని నెలల పాటు ఈ వివాదం మీడియాలో నానింది. లావణ్య తరఫున జనసేన మాజీ నేత, లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర కోర్టులో ఆ కేసులు వాదించాడు. మీడియా వేదికగా రాజ్, లావణ్య పరస్పరం చాలా ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. లావణ్య అయితే రాజ్ మీద టీవీ, యూట్యూబ్ ఛానెళ్లలో ఎన్ని మాటలందో, ఆరోపణలు చేసిందో లెక్కలేదు. ఈ కేసుల వల్ల రాజ్ ను వెంటాడి వేధించింది. అతడి కెరీర్ మీద కూడా ఇది ప్రభావం చూపింది.
కట్ చేస్తే ఇప్పుడు మొత్తం కథ మారిపోయింది. రాజ్ తర్వాత లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు భావిస్తున్న యూట్యూబర్ మస్తాన్ సాయి తాజాగా అరెస్టయ్యాడు. అతడి దగ్గర వందల కొద్దీ అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. లావణ్య కూడా అతడి బాధితురాలే అంటున్నారు. మరోవైపేమో ఒక పోలీసాఫీసర్‌తో లావణ్య బంధం గురించి, ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్స్ గురించి ఒక వ్యవహారం బయటికి వచ్చింది.
దీంతో లావణ్య మీద అనేక సందేహాలు వస్తున్నాయి జనాలకు. ఇదే సమయంలో మీడియా ముందుకు వచ్చిన లావణ్య.. రాజ్ తరుణ్ అమాయకుడంటూ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. మస్తాన్ సాయిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించేందుకు తాను నాటకం ఆడానని.. ఈ క్రమంలోనే రాజ్ మీద కేసులు పెట్టానని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
రాజ్ తరుణ్‌కు సారీ చెప్పడమే కాక.. తన దగ్గరుంటే అతడి కాళ్లు పట్టుకునేదాన్నని కూడా పేర్కొంది లావణ్య. ఐతే ఇన్నాళ్లూ లావణ్య చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలు, ఆమె పెట్టిన కేసుల వల్ల రాజ్ ఎంత ఇబ్బంది పడ్డాడో అందరికీ తెలిసిందే. మీడియా కూడా వాటి ఆధారంగానే అతణ్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడు చూస్తే లావణ్య మొత్తం మాట మార్చేసింది.
ఇంతా చేసి జస్ట్ ఇప్పుడు సారీ చెప్పేస్తే సరిపోతుందా అన్నది ప్రశ్న. తప్పుడు ఆరోపణలు చేసి కేసులు పెట్టినందుకు, అబద్ధాలు చెప్పి అందరినీ తప్పుదోవ పట్టించినందుకు ఆమె మీద పోలీసులు ఏం చర్యలు చేపడతారన్నది ఇప్పుడు ప్రశ్న.