బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే సినిమా మల్లీశ్వరి. వెంకటేష్ హీరోగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు మాములుగా పేలలేదు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించి పెట్టాయి. తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగు చేసింది కానీ ఆశించిన ఫలితం రాలేదు.
తెలుగులో అవకాశాలు వచ్చినా బాలీవుడ్ లోనే తెగ బిజీ అయిపోవడంతో మళ్ళీ ఇటు పక్క తిరిగి చూడలేదు. ఇదంతా 2005 అంటే ఇరవై సంవత్సరాల క్రితం ముచ్చట. తర్వాత కత్రినా హిందీలో బోలెడు విజయాలు సాధించడం, విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఇప్పుడీ మల్లీశ్వరి భర్త సాధిస్తున్న బ్లాక్ బస్టర్లు చూసి తెగ మురిసిపోతోంది. తాజాగా విడుదలైన చావా భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్ప 2ని సవాల్ చేసే రేంజ్ లో చావా నెంబర్లు నమోదవుతున్నాయి. మొదటి వీకెండ్ కే సులభంగా వంద కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
శంభాజీ మహారాజ్ పాత్ర కోసం 100 కేజీలకు పైగా బరువు ఉండేలా చూసుకుని శారీకరంగా శ్రమ పడిన విక్కీ కౌశల్ దానికి తగ్గట్టే తెరమీద టెర్రఫిక్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. వేరే ఏ ఆర్టిస్టు ఊహించలేనంత గొప్పగా జాతీయ అవార్డు రావొచ్చనే స్థాయిలో పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
విక్కీ కౌశల్ పడిన కష్టం దీనికొకటే కాదు. గతంలో శామ్ బహదూర్ క్యారెక్టర్ కోసం రెండు సంవత్సరాలు కఠోర పరిశోధన చేసి తనను తాను సంసిద్ధం చేసుకున్నాడు. ఉరి సర్జికల్ స్ట్రైక్ కోసం దర్శకుడు బరువు విషయంలో సూచనలు చేస్తే తక్కువ టైంలో పధ్నాలుగు కేజీలు తగ్గించుకుని శబాష్ అనిపించుకున్నాడు.
మధ్యలో కొన్ని రెగ్యులర్ ఎంటర్ టైనర్లు చేశాడు కానీ చావా పుణ్యమాని స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టడం ఖాయం. ఇప్పుడున్న జోరు కనక కొనసాగితే ఫైనల్ రన్ అయ్యేలోపు స్త్రీ 2 కలెక్షన్లను దాటేస్తుందని ట్రేడ్ అంచనా. నాలుగేళ్ల క్రితం మన మల్లీశ్వరితో పెళ్ళైన వేళా విశేషమో ఏమో కానీ విక్కీ దూసుకుపోతున్నాడు.