పెద్దల మాట చద్దిమూటనే సామెత ఊరికే రాలేదు. దాని వెనుక బోలెడు అర్థముంది. తానెంతో ఇష్టపడే దర్శకుడు పూరి జగన్నాధ్ ఫ్లాపుల్లో ఉండటం బాధిస్తోందని, డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ కు ముందే తనకు కథ చెబితే సలహాలు ఇస్తానని విజయేంద్రప్రసాద్ చెప్పడం ఫ్యాన్స్ కి గుర్తే. అయితే పూరి కాల్ చేయకపోవడం, సినిమా డిజాస్టర్ కావడం తెలిసిందే.
ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఉదంతం అలాగే అనిపిస్తోంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన తాజా యూట్యూబ్ వీడియోలో ఇందులో తప్పొప్పులను తనదైన శైలిలో వివరించి ఒకవేళ ముందే సరిచేసి ఉంటే ఖచ్చితంగా ఫలితం మారేదని వివరించడం బాగుంది.
పరుచూరి వారి ప్రకారం హీరో రామ్ నందన్ హీరోయిన్ కేవలం ఒక మాట అనగానే ఫైట్లు మానేసి కోపాన్ని అణుచుకోవడం మాస్ కి ఎంత మాత్రం కనెక్ట్ కాలేని పాయింట్. పైగా అభిమానుల్లో ఎక్కువగా ఉండే మాస్ కి అంతగా చేరువ కాలేని కలెక్టర్ పాత్రలో చరణ్ ని చూపించడం సామాన్య జనానికి దూరం చేసింది.
క్లైమాక్స్ ఎండ్ టైటిల్స్ లో రామ్ ని ముఖ్యమంత్రి చేసిన శంకర్ ఆ పనేదో అరగంట ముందే చేసి ఉంటే డ్రామా పండటంతో పాటు ఒకే ఒక్కడు తరహాలో ఎలివేషన్లు దక్కేవి. శ్రీకాంత్ చుట్టూ నాటకీయత బాగా వచ్చి చరణ్ వైపు కథనం బలహీనంగా ఉండటం వల్లే ప్రేక్షకులు తిరస్కరించడానికి ఆస్కారం దొరికింది.
తండ్రి హత్యకు కారణమైన వాళ్ళు ముఖ్యమంత్రి కావడం కూడా మరో లోపమని గోపాలకృష్ణ గారి అభిప్రాయం. నిజంగా ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంత అనుభవమున్న శంకర్ చాలా విషయాల్లో ఎంత నిర్లక్ష్యం వహించారో చెప్పేందుకు పైన ఉదాహరణలు చాలు.
అసలు సునీల్, అంజలికి ఇద్దరికీ ఒకే రకమైన జబ్బు లాంటిది పెట్టడం లాంటి తప్పులు ఎన్నో జరిగాయి. సరే అయిందేదో అయ్యింది, ఇప్పుడు రిజల్ట్ మార్చలేం కానీ భవిష్యత్తులో తీయబోయే సినిమాలకు ఇలాంటి పాఠాలు చాలా ఉపయోగపడతాయి. అంత్యనిష్టూరం కంటే ఆదినిష్టూరం మంచిదని గుర్తిస్తే తప్పులు జరగవు.