యానిమల్, పుష్ప 2 ది రూల్ రెండు ఇండస్ట్రీ హిట్లతో ఊపుమీదున్న రష్మిక మందన్న హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకంతో చావా మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. ప్రమోషన్ల కోసం కాలు బాలేకపోయినా వీల్ చైర్ వేసుకుని హైదరాబాద్ నుంచి ముంబైకి ట్రిప్పులు కొట్టింది.
బాగైన తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చి, ఈవెంట్లకు వెళ్లి తనవరకు ఎంత చేయాలో అంతా చేసింది. దానికి తగ్గట్టే చావాకు సూపర్ హిట్ టాక్ నడుస్తోంది. యునానిమస్ గా కాకపోయినా అధిక శాతం విమర్శకులు కంటెంట్ మెచ్చుకుంటున్నారు. విక్కీ కౌశల్ నటనను కొనియాడుతున్నారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం గురించి కితాబు ఇస్తున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ ఎటొచ్చి రష్మికకు ప్రశంసలు దక్కడం లేదు. కారణం ఆమె పోషించిన రాణి యేసుబాయ్ కి కథ పరంగా తక్కువ స్కోప్ దొరకడం. అందులోనూ స్వంత డబ్బింగ్ చెప్పుకోవడంతో మరాఠా యాస కనిపించాల్సిన హిందీ డైలాగుల్లో సౌత్ ఫ్లేవర్ వినిపించింది. దీంతో ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు.
నిజానికి యేసుబాయ్ గొప్పదనం చిన్నది కాదు. శంభాజిని ఔరంగజేబు ఎత్తుకుపోతే చిన్న వయసులో ఉన్న కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి మొత్తం రాజతంత్రం ఆవిడే చూసుకుంటుంది. అదంతా చావాలో చూపించలేదు. అసలామెని వీరమహిళగా ప్రొజెక్ట్ చేయడంలో లక్ష్మణ్ ఆసక్తి చూపించలేదు.
దీంతో రష్మికకు పెద్దగా పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం లేకపోయింది. స్క్రీన్ మొత్తం విక్కీ కౌశల్, రక్తం నిండిపోతే ఇక తనైనా చేయడానికి ఏముంటుంది. అందుకే ఈ సినిమాని చూసేందుకు ఆమె ఫ్యాన్స్ ఒక ఆప్షన్ గా పెట్టుకుంటే మాత్రం ఎక్కువ ఊహించుకోకపోవడం బెటర్. రన్బీర్ కపూర్, అల్లు అర్జున్ కాంబోలో మంచి పవర్ ఫుల్ సీన్లు చేసిన రష్మికకు చావాలో మాత్రం ఆ ఛాన్స్ దొరకలేదు.
గతంలో ఇదే శంభాజీ మీద వచ్చిన ఇతర మరాఠి సినిమాల్లో యేసుబాయ్ ని హైలైట్ చేయడం కొసమెరుపు. ఏది ఏమైనా కోరుకున్న హిట్టయితే వచ్చేసింది కాబట్టి శ్రీవల్లి ఖాతాలో పెద్ద హ్యాట్రిక్ నమోదు కావడం ఖాయమే.