అమరన్ దర్శకుడితో ప్రభాస్… నిజమా ?

గత ఏడాది అమరన్ రూపంలో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి త్వరలో ప్రభాస్ తో ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడనే వార్త ఒక్కసారిగా గుప్పుమనడంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఈ మధ్య కోలీవుడ్ డైరెక్టర్లు మనోళ్లకు గట్టిగానే షాకిస్తున్నారు.

రామ్ వారియర్, నాగచైతన్య కస్టడీ, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇవన్నీ ఇచ్చింది తమిళ దర్శకులే. మరి డార్లింగ్ అంత రిస్క్ చేస్తాడానే అనుమానం లేకపోలేదు. అయినా ఆర్మీ ఆఫీసర్ బయోపిక్ తో మూడు వందల కోట్లు దాటించిన ప్రతిభను అంత తక్కువంచానా వేయలేం కానీ ఇది నిజమా కాదానేది అసలు ప్రశ్న.

ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రాజ్ కుమార్ ఒక లైన్ సిద్ధం చేసుకుని ప్రభాస్ కి వినిపించిన మాట వాస్తవమే కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రస్తుతం ఇతను ధనుష్ 55 హ్యాండిల్ చేస్తున్నాడు. ఆ మధ్య పూజా కార్యక్రమాలు చేశారు కానీ ఇంకా రెగ్యులర్ సెట్స్ కి వెళ్ళలేదు.

అటుఇటుగా ఒక ఏడాది దీనికి లాక్ కాబోతున్నాడు. ఆ తర్వాత మరోసారి శివ కార్తికేయన్ కు ఒక సినిమా చేస్తానని కమిట్ మెంట్ ఇచ్చాడు. అది ఎప్పుడనేది స్పష్టత లేదు కానీ వచ్చే సంవత్సరంలో ఈ కాంబో ఉండొచ్చు. ఇక ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీలు పూర్తి చేసుకున్న వెంటనే స్పిరిట్ సెట్లలో అడుగు పెడతాడు.

ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 శౌర్యంగపర్వం ఉంటాయి. ఇవన్నీ అయ్యేలోగా 2027 వచ్చేస్తుంది. ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న ప్రభాస్ నిజంగా తలుచుకోవాలే కానీ రాజ్ కుమార్ పెరియస్వామికి డేట్లు సర్దుబాటు చేయడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ప్రస్తుతం అంత టైం లేకపోవడమే అసలు సమస్య.

సో ఒకవేళ కార్యరూపం దాల్చినా అమరన్ దర్శకుడితో చేతులు కలపడానికి చాలా టైం పడుతుంది. అయినా ప్రభాస్ లాంటి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న స్టార్ తో ఒక్క సినిమా చేస్తే ఆయా దర్శకుల డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది పసిగట్టే రాజ్ కుమార్ ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.